Gold discounts in Dubai
Gold discounts in Dubai : ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడులకు పాల్పడుతున్నాయి. ఇరాన్ సైతం ప్రతిదాడులకు దిగడంతో పశ్చిమాసియాలో యుద్ధంకు దారితీసింది. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాలు బాంబుల వర్షం కురిపించుకుంటున్నాయి. ఈ యుద్ధం కారణంగా ప్రపంచంలోని పలు దేశాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.
ముఖ్యంగా భారతదేశంలో పేద, మధ్య తరగతి వర్గాలపై యుద్ధ ప్రభావం పడుతుంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలతోపాటు వంటనూనెల ధరలు పెరిగాయి. తాజాగా.. గ్యాస్ ధరలనుసైతం చమురు సంస్థలు భారీగా పెంచేశాయి. మరోవైపు.. యుద్ధం ప్రభావం దుబాయ్ పైనా పడింది.
యుద్ధం ప్రభావంతో దుబాయ్‌లో బంగారంపై రాయితీ ఇస్తున్నారు. వాస్తవానికి అంతర్జాతీయంగా లోహం రూపంలో బంగారం వ్యాపారానికి దుబాయ్ కేంద్రంగా ఉంది. ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లోనూ ఇరాన్ దాడులు చేస్తోంది. దీంతో విమాన సర్వీసులు అరకొరగా నడుస్తున్నాయి. షిప్పింగ్ రవాణా నిలిచిపోయింది. ఫలితంగా దుబాయ్ నుంచి బంగారాన్ని వివిధ దేశాలకు డెలివరీ చేయడానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ముఖ్యంగా దుబాయ్.. ఆసియా దేశాలకు బంగారం శుద్ధి చేసి ఎగుమతి చేసే ప్రధాన కేంద్రంగా ఉంది. అలాగే స్విట్టర్లాండ్, యూకే, కొన్ని ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే బంగారం కూడా దుబాయ్ ద్వారా రవాణా అవుతుంది. అయితే, టెహ్రాన్ కు, అమెరికా – ఇజ్రాయెల్ కు మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఇరాన్ క్షిపణి దాడుల నేపథ్యంలో గగనతలం పాక్షికంగా మూతపడింది.
మామూలు రోజుల్లో ప్రయాణికుల విమానాల్లో, కార్గో విమానాల్లో సరకు తరలింపునకు ఉండే చోటులోనే, సురక్షితంగా బంగారాన్ని కూడా పంపుతుంటారు. ప్రస్తుతం యుద్ధం కారణంగా యూఏఈ విమానాల రాకపోకలకు తీవ్ర అవరోధాలు ఏర్పడుతున్నాయి. సౌదీ అరేబియా – ఒమన్ దేశాల విమానాశ్రయాలకు పంపి.. అక్కడి నుంచి వివిధ దేశాలకు బంగారం తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, డెలివరీ వ్యయాలు, బీమా ఖర్చులు గణనీయంగా పెరగడంతో పాటు, సమయానికి సరకు చేరుతుందన్న నమ్మకం లేకపోవడంతో కొత్త ఆర్డర్లు ఇచ్చేందుకు కొనుగోలుదారులు ముందుకు రావడం లేదు.
ఇరాన్, ఇజ్రాయెల్ వార్ కారణంగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారంపై కొత్త ఆర్డర్లు భారీగా తగ్గిపోయాయి. దీంతో బంగారంపై పెట్టిన పెట్టుబడులను దీర్ఘకాలం వృథాగా ఉంచడం ఇష్టంలేకే దుబాయ్ వ్యాపారులు అంతర్జాతీయ ధర కంటే తక్కువకే బంగారాన్ని అమ్మేందుకు సముఖత చూపుతున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు గోల్డ్ రేటు 5,147 డాలర్లకుపైగా ఉంది. అయితే, దుబాయ్ లో మాత్రం 30 నుంచి 40 డాలర్లకు తక్కువకు బంగారాన్ని విక్రయాలుచేస్తున్నారు.