US Iran War: చర్చలకు రావాలి.. ఇరాన్ కు అమెరికా లేఖ.. లేదంటే ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ప్లస్..!

హర్మూజ్ జలసంధిలో చిక్కుకుపోయిన నౌకలను సురక్షితంగా బయటకు తెచ్చేందుకు చేపట్టిన ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ను తిరిగి పునరుద్ధరించే విషయాన్ని తమ యంత్రాంగం పరిశీలిస్తుందన్నారు ట్రంప్.

  • Updated on- May 9, 2026 / 04:44 PM IST

US Iran War: మిడిల్ ఈస్ట్ వార్ కు ఎండ్ కార్డ్ వేసేలా కీలక ముందడుగు పడింది. చర్చలకు రావాలంటూ ఇరాన్ కు లేఖ పంపింది అమెరికా. 14 పాయింట్ల అవగాహన ఒప్పందాలను ఆ లేఖలో పేర్కొంది అమెరికా. ఇరాన్ అణు కార్యక్రమం, యురేనియం నిల్వల బదిలీ, హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలను తగ్గించడం వంటి కీలక అంశాలు ఉన్నాయి. ఇక తమ ప్రతిపాదనలపై ఇరాన్ సానుకూలగా స్పందిస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

హర్మూజ్ జలసంధిలో చిక్కుకుపోయిన నౌకలను సురక్షితంగా బయటకు తెచ్చేందుకు చేపట్టిన ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ను తిరిగి పునరుద్ధరించే విషయాన్ని తమ యంత్రాంగం పరిశీలిస్తుందన్నారు ట్రంప్. ఒకవేళ ఇరాన్ చర్చలకు రాకుంటే ఈ కార్యక్రమాన్ని ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ప్లస్ గా మార్చుతామని హెచ్చరించారు. కాగా, అమెరికా ప్రతిపాదనపై ఇరాన్ ఇంతవరకు స్పందించలేదు.

మరోవైపు అమెరికాకు ఇరాన్ గట్టి హెచ్చరికలు చేసింది. ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియోకు యూఎస్ లోని ఇరాన్ శాశ్వత ప్రతినిధి లేఖ రాశారు. హర్మూజ్ జలసంధిలో సైనిక చర్యలకు దిగి యూఎస్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపించారు. ఇక పర్షియన్ గల్ఫ్, హర్మూజ్ జలసంధిలో యూఎస్ తన సైనిక కార్యకలాపాలు కొనసాగిస్తే విపత్కర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

అమెరికా ప్రతిపాదనపై ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రతిపాదన సమీక్షలోనే ఉందన్నారు. గడువు విషయంలో వాషింగ్టన్ తమపై ఒత్తిడి చేయలేదన్నారు. “అమెరికా రాజకీయ నాయకులు నిర్దేశించిన గడువులకు అర్థం లేదు. మేము మా పని మేము చేసుకుంటాము. గడువులు లేదా తుది హెచ్చరికలతో మాకు సంబంధం లేదు” అని ఇస్మాయిల్ తేల్చి చెప్పారు.

Also Read: చైనాలో ‘డెత్ వ్యాన్’లు అంటే ఏమిటి? వాటిలో నేరస్తులను తీసుకెళ్లి ఏం చేస్తారు.. ఆ ప్రాణాంతక ఇంజెక్షన్లు ఎందుకిస్తారో తెలుసా?