అమెరికా : ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో ఈ నెలలో ‘అణు సమావేశం’ నిర్వహించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ వెల్లడించారు. అమెరికా పార్లమెంట్ లో జాతినుద్దేశించి ప్రసంగించిన సందర్భంగా ట్రంప్ ఈ ప్రకటన చేశారు. ఫిబ్రవరి 27, 28 తేదీల్లో కిమ్ జోంగ్ ఉన్‌తో వియత్నాంలో సమావేశమవుతున్నానని ట్రంప్ ప్రకటించారు. గతంలో జరిగిన భేటీలో తీసుకున్న నిర్ణయాలు అమలు కాలేదనీ..అణు పరీక్షలు ఆగాయని, గత 15 నెలల్లో కొత్తగా క్షిపణి ప్రయోగాలూ జరగలేదని అన్నారు. తాను కనుక అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికకాకుంటే ఈసరికి ఉత్తరకొరియాతో యుద్ధం జరిగేదని కూడా ట్రంప్ అభిప్రాయపడ్డారు. కిమ్‌తో మంచి సంబంధాలే ఉన్నాయి.. చేయాల్సింది ఇంకా చాలా ఉందని ట్రంప్ అన్నారు.
సింగపూర్ లో తొలి భేటీ : 2018 జూన్ నెలలో ట్రంప్, కిమ్ జోంగ్ తొలి భేటీ సింగపూర్‌లోని సెంటోజా ఐలాండ్ రిసార్ట్‌లో జరిగిన విషయం తెలిసిందే. ఈ చరిత్రాత్మక సమావేశం తరువాత అణు నిరాయుధీకరణ విషయంలో చెప్పుకోదగిన పురోగతి ఏమీ కనిపించలేదు. ఈ క్రమంలో రెండవసారి వీరిద్దరు భేటీ కానున్నారు. కిమ్ యాంగ్ చోల్ అమెరికా పర్యటనతో మళ్ళీ అణు దౌత్యంలో చాలా నెలల తరువాత కదలిక వచ్చిందని..విదేశాంగ వ్యవహారాల ప్రతినిధి బార్బరా ప్లెట్ అషర్ అన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, తాను చర్చల పట్ల సుముఖంగా ఉన్నానని అన్నారు.
సింగపూర్ సమావేశంలో కుదిరిన ఒప్పందాలు : సింగపూర్ లో జరిగిన సమావేశంలో ఏదైనా జరిగిందీ అంటే, అదంతా కాగితం మీదే జరిగింది. రెండు దేశాలు అణు నిరాయుధీకరణ దిశగా చర్యలు తీసుకోవడానికి అంగీకరిస్తున్నట్లు ఓ అస్పష్ట పత్రంపై సంతకం చేశాయి.
సింగపూర్ భేటీ అనంతరం అమలు కాని నిర్ణయాలు : సింగపూర్ సమావేశం తరువాత చెప్పుకోదగిన అంగీకారాలేమీ జరగలేదు. అణు నిరాయుధీకరణ విషయంలో పురోగతి కూడా దాదాపు లేదనే చెప్పాలి.అమెరికా, ఉత్తర కొరియాల మధ్య అణు నిరాయుధీకరణ చర్చలు ఆ తరువాత స్తంభించిపోయాయి. ఉత్తర కొరియాలోని అణ్వస్త్ర తయారీ కేంద్రాల వివరాలేవీ వెల్లడి కాలేదు. అమెరికా విధించిన ఆంక్షలు కూడా అలాగే కొనసాగుతున్నాయి.
ఉత్తర కొరియా – చైనా సంబంధాలు : అదే సమయంలో, ఉత్తర కొరియా – చైనా సంబంధాలు బలపడినట్లుగా కనిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో కిమ్ పలుసార్లు చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్‌ను కలవడానికి బీజింగ్ వెళ్ళి వచ్చారు. అసలు నిరాయుధీకరణ అంటే ఏం చేయాలి, దానికి కాల వ్యవధి ఏమిటి, ఆ ప్రక్రియ ఏ విధంగా కొనసాగాలనే వివరాలేవీ ఇప్పటికీ ఎవరూ స్పష్టం చేయలేదు. ఇప్పుడు తాజాగా ట్రంప్- కిమ్ రెండవ సారి భేటీలోనైనా స్పష్టమైన విధి విధానాలతో కూడిన ఒప్పందాలు ఉంటాయని పలు దేశాల నేతలు అభిప్రాయపడతున్నారు.