రేపే అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ట్రంప్, హారిస్ హోరాహోరీగా ప్రచారం

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమయం రానేవచ్చింది. అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలింది.

Donald Trump Kamala Harris

US Election 2024: ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమయం రానేవచ్చింది. అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలింది. మంగళవారం పోలింగ్ జరగనుంది. దేశంలో మొత్తం 24.4 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటికే ముందస్తు ఓటింగ్ ద్వారా 7.5 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య నువ్వానేనా అన్నట్లుగా పోరు కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలుసైతం అదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే ఇరువురు అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తించారు. ఇవాళ రాత్రితో వారి ప్రచారం ముగియనుంది. ఈ క్రమంలో రాలేగ్ లో ప్రచారంలో ట్రంప్ పాల్గొని మాట్లాడారు. కమలాహారిస్ గెలిస్తే సరిహద్దుల్లో వలసదారులకు గేట్లు తెరిచేస్తారని ట్రంప్ అన్నారు.

Also Read: ఎన్ని యుద్ధాలు జరిగితే అమెరికాకు అంత లాభమా? యూఎస్ ఎకానమీని కాపాడుతోంది అదేనా?

పెన్సిల్వేనియా సభలో ట్రంప్ మాట్లాడుతూ.. 2020లో ఓటమి తరువాత వైట్ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోకుండా అక్కడే ఉండాల్సిందనే అభిప్రాయాన్ని ట్రంప్ వ్యక్తం చేశారు. నేను పదవి నుంచి దిగిపోయిన రోజున చరిత్రలోనే అత్యంత సురక్షితమైన సరిహద్దు అమెరికాకు ఉంది. అమెరికా అధ్యక్షుడిగా చాలా అద్బుతంగా పనిచేశాను. కాబట్టి నేను వెళ్లిపోయి ఉండకూడదని ట్రంప్ గత ఎన్నికల సమయంలో ఓటమిని గుర్తు చేసుకున్నారు. అయోవా రాష్ట్రంలో కమలా హారిస్ కు 47శాతం, ట్రంప్ నకు 44శాతం మంది మద్దతు ఉందంటూ తాజా పోల్ విడుదలైంది. దానిపై డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. అదంతా ఫేక్ అని అన్నారు. అది పూర్తిగా ఫేక్ పోల్. ప్రత్యర్థులు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ట్రంప్ మండిపడ్డారు.

 

గాజా యుద్ధాన్ని ఆపుతా.. కమలాహారిస్
మిషిగాన్ ర్యాలీలో డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలాహారిస్ మాట్లాడారు. నా శక్తినంతా ఉపయోగించి గాజా యుద్ధానికి ముగింపు తీసుకొస్తానని, అక్కడ బందీలుగా చిక్కుకున్న వారిని విడిపిస్తానని చెప్పారు. హారిస్ తన ప్రసంగంలో అమెరికాలో కొత్తతరం నాయకత్వం యొక్క ఆవశ్యకతను కూడా నొక్కి చెప్పారు. అమెరికాలో కొత్త తరం నాయకత్వానికి ిది సమయం. యూఎస్ తదుపరి అధ్యక్షుడిగా ఆ నాయకత్వాన్ని అందించడానికి నేను సిద్ధంగా ఉన్నానని హారిస్ అన్నారు. ఆరోగ్య సంరక్షణ ఖర్చులను తగ్గించడం, కార్మికులు, మధ్య తరగతి కుటుంబాలకు పన్నులు తగ్గించడం, గృహ నిర్మాణం, పిల్లల సంరక్షణను మరింత సరమైనదిగా చేస్తామని హామీ ఇచ్చారు.