US Tariffs : భారత్‌కు బిగ్ షాకిచ్చేందుకు సిద్ధమైన ట్రంప్.. ఆ బిల్లుకు అమెరికా సెనెట్ ఆమోదం..

US Tariffs : భారత్ - అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత దేశానికి బిగ్ షాకిచ్చేందుకు అమెరికా సిద్ధమైంది.

Donald Trump

US Tariffs : భారత్ – అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత దేశానికి బిగ్ షాకిచ్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. భారత్ పై మళ్లీ టారిఫ్‌లతో విరుచుకుపడేందుకు అన్ని అడ్డంకులు క్లియర్ అయ్యాయినట్లు సమాచారం.

Also Read : Donald Trump : ట్రంప్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. దర్యాప్తు చేపట్టిన ఎఫ్ఏఏ.. అసలేం జరిగిందంటే?

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి చమురు, సహజవాయువు కొనుగోలు చేసే ప్రధాన దేశాలపై భారీ సుంకాలు విధించేందుకు వీలు కల్పించే బిల్లుకు అమెరికా సెనేట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు 86-11 ఓట్లతో సెనేట్ ఆమోదం లభించింది. ఆగస్టు 31న ఈ బిల్లు ప్రతినిధుల సభ ముందుకు రానుంది. అక్కడ కూడా ఆమోదం పొందిన తరువాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకంతో ఇది చట్టరూపం దాల్చనుంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే భారత్ పై 100శాతం సుంకాల మోత మోగనుంది.

ఈ బిల్లు చట్టంగా మారితే రష్యా నుంచి పెద్ద మొత్తంలో చమురు, గ్యాస్ దిగుమతి చేసుకునే దేశాలపై 100 శాతం వరకు టారిఫ్‌లు విధించే అధికారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు లభిస్తుంది. ప్రస్తుతం రష్యా ఇంధనాన్ని అధికంగా దిగుమతి చేసుకునే దేశాల జాబితాలో భారత్, చైనా కూడా ఉన్నాయి. అజర్‌బైజాన్, హంగేరీ, స్లోవేకియా కూడా ఈ జాబితాలో ఉన్నట్లు నివేదిక పేర్కొంది.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పాటు ఆ దేశానికి చెందిన సీనియర్ రాజకీయ, సైనిక నేతలు, ఆర్థిక సంస్థలు, ఇంధన ప్రాజెక్టులపై కూడా ఆంక్షలు విధించే నిబంధనలు బిల్లులో ఉన్నాయి. ఇదిలాఉంటే.. రష్యా నుంచి తమ సహజవాయువు దిగుమతులను గణనీయంగా తగ్గిస్తున్న దేశాలకు కొన్ని మినహాయింపులు కల్పించే నిబంధనలు కూడా బిల్లులో ఉన్నాయి. అలాగే జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అవసరమైతే ఆంక్షలను మినహాయించే అధికారం అమెరికా అధ్యక్షుడికి ఉంటుంది.

సెనేట్ ఆమోదించిన బిల్లు ఇప్పుడు అమెరికా ప్రతినిధుల సభ (House of Representatives)కు వెళ్లనుంది. ఆగస్టు 31న సభ తిరిగి సమావేశమైన తర్వాత ఈ బిల్లుపై తదుపరి ప్రక్రియ జరగనుంది. అనంతరం బిల్లు చట్టంగా మారితే భారత్, చైనా సహా రష్యా ఇంధనాన్ని కొనుగోలు చేసే దేశాలపై అమెరికా వాణిజ్య ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా, రష్యాపై ఒత్తిడి పెంచేందుకు అమెరికా చేపడుతున్న చర్యల్లో ఈ బిల్లు కీలక పరిణామంగా మారింది. భారత్‌ రష్యా నుంచి చమురు దిగుమతుల విషయంలో ఇప్పటికే అమెరికా ఒత్తిడిని ఎదుర్కొంటున్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.