×
Ad

మిలటరీని దించుతా…ఆందోళనకారులకు ట్రంప్ హెచ్చరిక

మిన్నియాపోలీస్ సిటీ పోలీసుల పోలీసు చేతిలో ప్రాణాలు కోల్పోయిన నల్ల జాతీయుడు “జార్జ్‌ ఫ్లాయిడ్‌”కి మద్దతుగా అగ్రరాజ్యంలో కొనసాగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. అనేక న‌గ‌రాల్లో ఆందోళనకారులు బీభ‌త్సం సృష్టించారు. వాహనాలను తగులబెట్టారు.షాపులను ధ్వంసం చేశారు. వాషింగ్టన్ లోని వైట్‌హౌస్ ను కూడా ఆందోళనకారులు దిగ్భంధించడంతో… అధ్యక్షుడు ట్రంప్ సైతం కొన్ని గంటల పాటు వైట్ హౌస్ లోని బంకర్ లో దాక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది.

ఈ సమయంలో ఆందోళనకారులకు తీవ్ర హెచ్చరికలు చేశారు అధ్యక్షుడు ట్రంప్. ఆందోళ‌న‌కారుల్ని త‌రిమేందుకు అమెరికా వీధుల్లో మిలటరీని రంగంలోకి దింప‌నున్న‌ట్లు ఆయ‌న హెచ్చ‌రించారు. వైట్‌హౌజ్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… వివిధ న‌గ‌రాలు, రాష్ట్రాల అధికారులు త‌మ ప్ర‌జ‌ల్ని కాపాడ‌లేక‌పోతే, అప్పుడు ఆర్మీని రంగంలోకి దింప‌నున్న‌ట్లు ట్రంప్ తెలిపారు. అమెరికాలోని చాలా నగరాల్లో క‌ర్ఫ్యూ విధించారు. న్యూయార్క్ సిటీలో కూడా క‌ర్ఫ్యూ విధించారు.   

సోమ‌వారం సాయంత్రం వైట్‌హౌజ్ రోజ్ గార్డెన్ దగ్గర ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఆ స‌మ‌యంలో బ‌య‌ట ఆందోళ‌న‌కారుల్ని చెద‌రగొడుతున్న శ‌బ్ధాలు వినిపించాయి. జార్జ్ ఫ్లాయిడ్ మృతి ప‌ట్ల ప్ర‌తి అమెరిక‌న్ ప‌శ్చాతాపం వ్య‌క్తం చేస్తున్నార‌ని, కానీ కొంద‌రి ఆగ్ర‌హానికి ఎవ‌రూ బ‌లికావ‌ద్దు అని అన్నారు. దేశ‌రాజ‌ధానిలో జ‌రుగుతున్న లూటీలు, హింస‌.. అవ‌మాన‌క‌ర‌మ‌ని తెలిపారు.

వాషింగ్ట‌న్ డీసీకి వేలాది మంది సైనికులను, పోలీసు అధికారుల్ని మోహ‌రిస్తున్న‌ట్లు ట్రంప్ చెప్పారు. లూటీలు, విధ్వంసం, దాడులు ఆపేందుకు, ప్రాప‌ర్టీల‌ను ర‌క్షించుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. హింస‌కు పాల్ప‌డుతున్న వారికి క‌ఠిన శిక్ష‌లు ఉంటాయ‌ని ట్రంప్ హెచ్చరించారు. మరోవైపు అమెరికాలో అశాంతి నెలకొన్న సమయంలో…సోమవారం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్… వైట్ హౌస్ సమీపంలోని సెయింట్ జాన్ చర్చిని సందర్శించి అందరినీ ఆశ్చర్యపర్చారు. గతంలో ఎన్నడూ చేయని విధంగా ట్రంప్… వైట్ హౌస్ గేట్లను దాటి లాఫాయెట్ పార్క్ మీదుగా చర్చివరకు నడిచాడు. ఆ సమయంలో ట్రంప్ తన చేతిలో బబిల్ పట్టుకుని కన్పించారు.

Read: నల్లగా ఉండేవారి జీవితాలు విలువైనవే..