Vivek Ramaswamy - Apoorva Ramaswamy
United States election 2024 – Apoorva Ramaswamy: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ (Republican) పార్టీ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న భారత సంతతి పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామి(Vivek Ramaswamy)కి మహిళా ఓటర్ల నుంచి అంతగా మద్దతు దక్కట్లేదని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దీనిపై వివేక్ రామస్వామి భార్య అపూర్వ రామస్వామి స్పందించారు.
ఆ నివేదికలను అపూర్వ కొట్టిపారేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అపూర్వ మాట్లాడారు. డిబేట్లో మాట్లాడిన తర్వాత వివేక్‌ను చాలా మంది మహిళలు అహంకారిగా భావించారని వచ్చిన నివేదికపై అపూర్వ స్పందిస్తూ.. తన భర్తపై కొందరు ఉద్దేశపూర్వకంగా, ప్రణాళికలు వేసుకుని ఇటువంటి దాడి చేస్తున్నారని చెప్పారు.
వారితో వివేక్ రామస్వామి పోరాడతారని అపూర్వ అన్నారు. దేశంపై వివేక్‌కు ఉన్న విజన్ ప్రకారం ఆయన ముందుకు వెళ్తారని చెప్పారు. డిబేట్ తర్వాత వచ్చిన రేటింగ్స్ కేవలం ఒకే ఒక్క డేటాకు సంబంధించినవి మాత్రమేనని అన్నారు. ఇటీవల నిర్వహించిన రిపబ్లికన్ పార్టీ ఆశావాహ అభ్యర్థుల డిబేట్లో తన భర్త అందరి దృష్టినీ ఆకర్షించారని, ఆసక్తిని రేకెత్తించారని వ్యాఖ్యానించారు.
తాము ఇద్దరం కలిసి తమ జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకున్నామని, తన కెరీర్ వివేక్ ఎన్నో త్యాగాలు చేశారని అపూర్వ చెప్పారు. వచ్చే ఏడాది అధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉన్న వేళ వివేక్ రామస్వామి రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీ(Democratic Party)లు తమ ప్రణాళికలను అమలు చేస్తున్నాయి.