Sarita Komatireddy : తెలుగు మహిళకు ట్రంప్ సపోర్టు.. ఎవరీ సరిత కోమటిరెడ్డి? అమెరికాలో టాప్ రేసులో..!

Sarita Komatireddy : భారత సంతతికి చెందిన లాయర్ సరిత కోమటిరెడ్డి న్యూయార్క్ అటార్నీ జనరల్ ఎన్నికల బరిలో నిలిచారు. ట్రంప్ మద్దతు, ఆమె న్యాయ ప్రస్థానం, రాజకీయ ప్రయాణంపై పూర్తి వివరాలివే..

Sarita Komatireddy, Donald Trump

  • న్యూయార్క్ రాజకీయాల్లో తెలుగు ముద్ర..
  • తెలంగాణ మూలాలు, సరిత సంచలన ప్రయాణం
  • అల్‌ఖైదా కేసుల నుంచి అటార్నీ జనరల్ బరివరకు
  • న్యూయార్క్ అటార్నీ జనరల్ రేసులో సరిత

Sarita Komatireddy : అమెరికా రాజకీయాల్లో మరోసారి తెలుగు పేరు మార్మోగుతోంది. న్యూయార్క్ అటార్నీ జనరల్ పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న సరిత కోమటిరెడ్డికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా మద్దతు ప్రకటించారు. ఇప్పుడు ఇదే ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

సరితపై ట్రంప్ ప్రశంసలు :
వచ్చే నవంబర్‌లో జరగనున్న ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి, ప్రస్తుత అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్‌తో సరిత పోటీపడనున్నారు. ఈ నేపథ్యంలో సరితను ట్రంప్ ప్రశంసలతో ముంచెత్తారు. ‘‘అమెరికా దేశ భక్తురాలు.. ఆమెకు మద్దతుగా నిలవడం నాకు చాలా గర్వంగా ఉంది..

ఆమె నాయకత్వంలో న్యాయవ్యవస్థ మరింత బలపడుతుంది. ఆర్థిక వ్యవస్థను డెవలప్ చేస్తారు. రాజ్యాంగాన్ని కూడా రక్షించగలరు’’ అంటూ ట్రంప్ సరితను ఉద్దేశించి మాట్లాడారు. ఇంతకీ ఎవరీ కోమటిరెడ్డి సరిత అంటే? పూర్తి వివరాల్లోకి తెలుసుకుందాం..

సరిత పేరెంట్స్ తెలంగాణవారే :
కోమటిరెడ్డి సరిత ఎవరో కాదు.. తెలంగాణ మూలాలున్న తెలుగుతేజం.. ఆమె పేరెంట్స్ ఇక్కడవారే.. నల్గొండ జిల్లాకు చెందిన ఈ వీరిద్దరూ వృత్తి రీత్యా డాక్టర్లే.. తండ్రి హనుమంత్ రెడ్డి కార్డియాలజిస్ట్ అయితే, తల్లి డాక్టర్ గీతా రెడ్డి రుమటాలజిస్ట్.. 1980లో అమెరికాలో ఈ దంపతులు స్థిరపడ్డారు. బ్రూక్లిన్‌లో సరిత జన్మించారు. అయితే, ఆమె పేరెంట్స్ ఉద్యోగరీత్యా మిస్సౌరీలో ఉండటంతో సరిత అక్కడే పెరిగారు. ప్రస్తుతం సరితకు 41 ఏళ్లు.. ఆమెకు నలుగురు సంతానం కూడా..

Read Also : Konda Surekha : సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం.. నాకేం సంబంధం? కొండా సురేఖ వివరణ

పిన్న వయసులోనే న్యాయ రంగంలో తనదైన ముద్రవేసింది. హార్వర్డ్ లా స్కూల్‌, హార్వర్డ్ కాలేజ్‌లో చదువు పూర్తి చేశారు. యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌లో క్లర్క్‌గా కూడా పనిచేశారు. కొలంబియా లా స్కూల్‌లో కూడా బోధించిన అనుభవం ఉంది.

ఇదే టర్నింగ్ పాయింట్ :
ఫెడరల్ ప్రాసిక్యూటర్‌గా మారడంతో సరిత కెరీర్ టర్న్ అయింది. అల్‌ఖైదా, ఐసిస్‌కు సంబంధించిన ఉగ్రవాద కేసులు, మెక్సికన్ డ్రగ్ కార్టెల్స్, సైబర్ నేరాలు, విదేశీ అవినీతి కేసులు, మనీలాండరింగ్, మోసం వంటి కేసులను ఆమె విచారించారు. అమెరికా డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్‌లో చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా కూడా వర్క్ చేశారు.

ప్రస్తుతం హోల్జ్‌మన్ వోగెల్ న్యాయ సంస్థలో సరిత భాగస్వామిగా ఉన్నారు. న్యూయార్క్ అటార్నీ జనరల్ పదవికి రిపబ్లికన్ పార్టీ నామినేషన్ పొంది తొలి తెలుగు అభ్యర్థిగా నిలిచారు. ఇప్పుడు ట్రంప్ మద్దతు లభించడంతో ఆమె ఎన్నికల పోరు మరింత ఆసక్తికరంగా మారింది.