×
Ad

Zohran Mamdani : ఎవరీ జోహ్రాన్ మమ్దానీ..? భారత దేశంతో అతనికున్న సంబంధాలేంటి..? 34ఏళ్లకే న్యూయార్క్ మేయర్‌గా విజయం.. ట్రంప్‌కే షాకిచ్చాడు..

Zohran Mamdani : అమెరికాలోని న్యూయార్క్ నగర మేయర్ స్థానంకు జరిగిన ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీకి చెందిన జొహ్రాన్ మమ్దానీ సంచలనం సృష్టించాడు.

Zohran Mamdani

Zohran Mamdani : అమెరికాలోని న్యూయార్క్ నగర మేయర్ స్థానంకు జరిగిన ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీకి చెందిన జొహ్రాన్ మమ్దానీ సంచలనం సృష్టించాడు. ఈ ఎన్నికల్లో తన ప్రత్యర్థి ఆండ్రూ క్యూమోపై దాదాపు లక్ష ఓట్లకుపైగా మెజార్టీతో విజయం సాధించి న్యూయార్క్ మేయర్ గా ఎన్నికయ్యారు.

అమెరికాలోని అతిపెద్ద నగరమైన న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల్లో 34ఏళ్ల జోహ్రాన్ మమ్దానీ విజయం సాధించారు. తద్వారా అమెరికా ఆర్థిక రాజధానిగా పిలుచుకునే న్యూయార్క్ మేయర్ కాబోతున్న తొలి ముస్లింగా, తొలి భారతీయ సంతతి వ్యక్తిగా, తొలి ఆఫ్రికాలో జన్మించిన వ్యక్తిగా జోహ్రాన్ చరిత్ర సృష్టించారు. ఆయన న్యూయార్క్ మేయర్ గా 2026 జనవరి 1వ తేదీన ప్రమాణస్వీకారణం చేయనున్నారు. అయితే, గత వందేళ్లలో న్యూయార్క్ మేయర్ పదవికి ఎన్నికైన పిన్న వయస్కుడు జోహ్రాన్ కావడం విశేషం.

జోహ్రాన్ తల్లిదండ్రులు ఎవరు..?
జోహ్రాన్ మమ్దానీ తండ్రి మహమూద్ మమ్దానీ ఒక విద్యావేత్త. ఉగాండాకు చెందిన పండితుడైన మహమూద్‌కు భారతీయ మాలాలు ఉన్నాయి. ఆయన గుజరాతీ ముస్లిం. ఆయన 1946లో బాంబేలో జన్మించారు. ఉగాండాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. జోహ్రాన్ మమ్దానీకి ఐదేళ్ల వయస్సు ఉన్నప్పుడు ఆయన కుటుంబం దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌కు మారింది. ఆ తరువాత రెండేళ్లకే న్యూయార్క్‌కు వెళ్లారు. అప్పటి నుంచి అక్కడే స్థిరపడ్డారు. జోహ్రాన్ తల్లి మీరా నాయర్ రూర్కేలాలోని హిందూ కుటుంబంలో జన్మించారు. దర్శకురాలైన ఆమె ఉన్నత విద్యావంతురాలు. 1988లో ‘సలామ్‌ బాంబే’ సినిమాతో దర్శకత్వంలో అడుగుపెట్టారు. ఆ సినిమాకు అంతర్జాతీయగా గుర్తింపు వచ్చింది. ఆస్కార్ అకాడమీ అవార్డుతోపాటు పలు పురస్కారాలకు నామినేట్ అయింది. దీంతో పాటు మరికొన్ని సినిమాలకు ఆమె దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు.

జోహ్రాన్ మమ్దానీ 1991 అక్టోబర్ లో ఉగాండాలోని కంపాలాలో జన్మించాడు. సైన్స్, ఆఫ్రికన్ స్టడీస్ లో మమ్దానీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. షియా ముస్లిం అయిన జోహ్రానీ.. సిరియాలో జన్మించిన రమా దువాజీని ఇటీవల వివాహం చేసుకున్నారు. ఆమె రచనలు ది న్యూయార్క్, ది వాషింగ్టన్ పోస్ట్ లాంటి వాటిల్లో ప్రచురితమయ్యాయి. జోహ్రాన్ దంపతులు క్వీన్స్‌లోని ఆస్టోరియాలో నివసిస్తున్నారు.

జోహ్రాన్ మమ్దానీ రాజకీయ విజయాల వెనుక తల్లిదండ్రుల పాత్రే ఎక్కువ. ముఖ్యంగా తల్లి మీరా నాయర్ జీవితం నుంచే ఆయన ఎన్నో పాఠాలు నేర్చుకున్నారు. ఆమె చెప్పిన కథలే జోహ్రాన్ రాజకీయ ప్రయాణానికి మూలస్తంభాలుగా నిలిచాయి. అణచివేతకు గళమెత్తాల్సిందే అనే నినాదంతో జోహ్రాన్ రాజకీయాల్లోకి వచ్చారు. 2020లో మమ్దానీ క్వీన్స్‌లో అప్పటికే నాలుగు సార్లు ఎన్నికైన అభ్యర్థిని ఎదుర్కొని విజయం సాధించాడు. దీంతో తొలిసారి న్యూయార్క్ అసెంబ్లీలో అడుగు పెట్టారు. తద్వారా ఉగాండాలో జన్మించిన తొలి వ్యక్తిగా ఆయన నిలిచారు. ఇజ్రాయెల్, పాలస్తీనా అనుకూల వైఖరిపై చేసిన వ్యాఖ్యలకు ఆయన విమర్శలను ఎదుర్కొన్నారు.