Woman Love Trap
China: ప్రేమ పేరుతో వలపు వల విసిరింది.. ఒకరి తరువాత ఒకరు ఇలా 36మంది యువకులు ఆమె వలలో చిక్కుకున్నారు. ఆ తరువాత మాటలతో ప్రేమ మత్తును రుచి చూపించింది.. దీంతో వారు ఆమె ప్రేమకు దాసోహం అయ్యారు. ఈ క్రమంలోనే వారికి ఓ షరతు పెట్టింది. నాతో సంబంధం కొనసాగించాలన్నా.. యువకుడి తల్లిదండ్రులను కలవాలన్నా ముందు ఒక ఇల్లు కొనాలని, అందుకు తాను కూడా ఆర్థిక సాయం చేస్తానని నమ్మించింది. దీంతో యువకులు అప్పు తీసుకొని, ఈఎంఐలు పెట్టి మరీ కొందరు ఇంటిని, మరికొందరు ఇంటి స్థలాన్ని కొనుగోలు చేశారు. ఆ తరువాత మాయలేడీ అసలు విషయం తెలిసి లబోదిబోమంటున్నారు.
ఓ యువతి విసిరిన ప్రేమ వలపులో ఒకరికి తెలియకుండా ఒకరు చిక్కుకొని 36 మంది యువకులు అప్పుల పాలయ్యారు. ఈ ఘటన చైనాలో చోటు చేసుకుంది. లియుజియా అనే మహిళ డేటింగ్ పేరిట పలువురు యువకులను ట్రాప్ లోకి దింపింది. తనది హునాన్ ప్రావిన్స్ అని, షెన్ జెన్ లోని ఎలక్ట్రిక్ కామర్స్ కంపెనీలో పనిచేస్తున్నానని వారిని మభ్యపెట్టింది. ఆ యువతి మాటలు నమ్మిన యువకులు ఒకరికి తెలియకుండా ఒకరు ఆమె ప్రేమలో పడ్డారు. అయితే, ఓ షరతు పెట్టింది. తనతో సంబంధం కొనసాగించాలన్నా, యువకుడి తల్లిదండ్రులను కలవాలన్నా ఒక ఇల్లు కొనాలని చెప్పింది. అందుకు తానుకూడా ఆర్థిక సాయం చేస్తానని నమ్మించింది.
ఆ యువతి మాటలు నమ్మిన యువకులు హుయ్ జౌ, గాంగ్ డాంగ్ ప్రాంతాల్లో ఇంటిని కొనుగోలు చేశారు. ఆ తరువాత కొద్దిరోజులకే యువకులతో మాట్లాడటం తగ్గించింది. మరికొన్ని రోజులకు అసలు ఫోన్ ఎత్తడమే మానేసింది. దీంతో ఆ యువతి గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించగా.. 36 మంది యువకులు ఆమె చేతిలో మోసపోయినట్లు గుర్తించారు. ఇదంతా ప్లాట్లు అమ్మడం కోసం రియల్ ఎస్టేట్ కు చెందిన సంస్థ వేసిన కుట్రలో భాగమని తెలుసుకున్నారు. కొద్దిరోజుల ప్రేమతోనే అప్పులపాలై, ఈఎంఐలు చెల్లించలేక ఆ యువకులు లబోదిబోమంటున్నారు.
బాధితుల్లో ఒకరు స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ‘‘గతేడాది మార్చిలో ఆన్ లైన్ డేటింగ్ ప్లాట్ ఫామ్ లో లియును కలిశాను. త్వరలోనే ఆమె ప్రేమలో పడ్డాను. ఆమె నాకు చాలా సన్నిహితురాలిగా మారింది. నా గురించి చాలా శ్రద్దచూపుతున్నట్లు మాట్లాడింది. ఆమె ఒక స్వచ్ఛమైన స్నేహితురాలు అని అనుకున్నా. ఆమె చెప్పినట్లుగానే రియల్ ఎస్టేట్ సంస్థలో ప్లాట్ కొనుగోలు చేశా. ఆ తరువాత కొద్దిరోజులకే ఆమె తనతో మాట్లాడటం పూర్తిగా మానేసింది. ఎందుకని ఆరా తీయగా అసలు విషయం తెలిసింది’ అంటూ బాధితుడు చెప్పుకొచ్చాడు.
మరో బాధితుడు మాట్లాడుతూ.. ‘‘లియును మాటలు విని నేను ఇల్లు కొన్న. ఆ తరువాత బిజీగా ఉన్నాననే సాకుతో నన్ను కలవడానికి నిరాకరించింది. నేను ఫోన్ చేస్తుంటే నా నెంబర్ బ్లాక్ చేసింది. ఆమె కాంట్రాక్ట్ లిస్ట్ నుంచి నన్ను తొలగించింది.’’ అని తెలిపాడు. అయితే, బాధితులంతా 30 నుంచి 36ఏళ్ల మధ్య వయస్సు వారు. వాందరూ ఆమెతో సుమారు రెండు నెలలు డేటింగ్ లో కొనసాగారు.