3 రోజులు లిఫ్టులోనే మహిళ 

సాంకేతిక కారణాలతో మూడ్రోజులుగా లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన పని మనిషిని న్యూయార్క్‌ పోలీసులు రక్షించారు.

  • Publish Date - January 29, 2019 / 11:13 PM IST

సాంకేతిక కారణాలతో మూడ్రోజులుగా లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన పని మనిషిని న్యూయార్క్‌ పోలీసులు రక్షించారు.

అమెరికా : సాంకేతిక కారణాలతో మూడ్రోజులుగా లిఫ్ట్‌లో పని మనిషి ఇరుక్కుపోయింది. సోమవారం న్యూయార్క్‌ పోలీసులు ఆమెను రక్షించారు. వివరాల్లోకి వెళితే.. న్యూయార్క్‌కు చెందిన బిలియనీర్‌ వారెన్‌ స్టీఫెన్‌ ఓ బ్యాంకులో పెట్టుబడిదారీగా ఉన్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన విహారయాత్రకు వెళ్లగా, వారింట్లోనే ఉన్న పని మనిషి మార్టీస్‌ ఫోర్టలీజా(53) శుక్రవారం సాయంత్రం లిఫ్ట్‌లోకి వెళ్లింది. ఇంతలో సాంకేతిక లోపం కారణంగా లిఫ్ట్‌ రెండు, మూడు ఫ్లోర్ల మధ్య చిక్కుకు పోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆమెను రక్షించేవారు లేక అలాగే ఉండిపోయింది. సోమవారం ఓ పార్సిల్‌ను అందజేసే నిమిత్తం వచ్చిన డెలివరీ బాయ్ స్టీఫెన్‌ కుటుంబ సభ్యుల్లో ఒకరిని సంప్రదించారు. పార్సిల్‌ను తీసుకోవడానికి ఆ వ్యక్తి ఇంటికి రాగా, పనిమనిషి లిఫ్ట్‌లో చిక్కుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే ఫోన్‌ ద్వారా సహాయక బృందాలకు సమాచారం అందించడంతో ఆ మహిళను వెలికితీశారు. మూడ్రోజులుగా నీరు, ఆహారం తీసుకోకపోవడంతో నీరసంగా, సరైన గాలి అందక ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉన్న స్థితిలో ఉన్నట్లు ఆ మహిళను గుర్తించారు. వెంటనే ఆమెను న్యూయార్క్‌లోని ప్రెస్బైటేరియన్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.