ఆడుకుంటూ నేర్చుకోవచ్చు..అంధ బాలల కోసం ‘‘బ్రెయిలీ’’ నేర్పే బొమ్మలు..

  • Publish Date - October 9, 2020 / 03:53 PM IST

‘World Vision Day’special “Braille” toys for blind children : దృష్టిలోపం ఉన్న చిన్నారులు సాధారణ పిల్లల్లా సరిగ్గా ఆడుకోలేరు. అందరితోను కలవలేదు. దీంతో డల్ గా ఉన్నచోటే ఉండిపోతారు. వారి కోసం ప్రత్యేకించి బొమ్మలంటూ ఏమీ లేవు. కానీ ఇప్పుడలా కాదు. దృష్టిలోపం ఉన్న చిన్నారుల కోసం ప్రత్యేకించి కొన్ని బొమ్మల్ని తయారు చేసింది యూకేలోని ఓ కంపెనీ.ఈ బొమ్మలతో ఆడుకుంటూనే బ్రెయిలీ నేర్చుకోవచ్చన్నమాట. భలే బాగుంది కదూ..ఆటకు ఆట భాషకు భాషా నేర్చుకునే ఈ విధానం..


అంధబాలలకు ‘వరల్డ్ విజన్ డే’ (Octover 10) సందర్భంగా యూకేలోని డానిష్కికు చెందిన టాయిస్ మేకింగ్ సంస్థ లెగో కార్పొరేషన్ లెగోస్ వంటి ఆటబొమ్మలను రూపొందించింది. దృష్టి లోపంతో బాధపడే పిల్లలకు బ్రెయిలీ నేర్పడానికి ఈ కొత్త లెగోస్‌ను తయారుచేసింది ఈ సంస్థ. వీటిని పిల్లలు ఆడటానికి ఉపయోగించడమే కాక వారు బ్రెయిలీ నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తుంది.


ఈ నూతన లెగో బ్రిక్స్‌పై బ్రెయిలీ ఆల్ఫాబెట్‌లో ఇండివిజువల్ నంబర్లు, అక్షరాలు ఉంటాయి. ఈ మోడల్‌ను డెవలప్ చేయడానికి రాయల్ నేషనల్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ బ్లైండ్ పీపుల్ (RNIB), లియోనార్డ్ చెషర్ వంటి మల్టీపుల్ చారిటీ సంస్థలతో కలిసి వీటిని తయారుచేసింది. 300 బ్రిక్స్ ఉండే ఈ టాయ్ కిట్లు అంథ బాలలను అలరించనున్నాయి. ఈ టాయ్స్‌ను లెర్నింగ్‌తో పాటు..దృష్టిలోపంతో బాధపడే చిన్నారుల మధ్య అంతరాన్ని తగ్గించడమే ముఖ్య ఉద్దేశంతో వీటిని తయారు చేశారు.




బ్రెయిలీలో ఉన్న ఈ టాయ్స్ ముఖ్యంగా పిల్లలు, లేదా పెద్దల కోసం స్పర్శ కదలికలతో నేర్చుకోవడంలో సహాయపడుతాయి. మరోవైపు ఈ ప్రత్యేకమైన లెగో బ్రిక్స్ కోసం ఆర్ఎన్ఐబీ కొంతమంది ఉపాధ్యాయులకు, సహాయక సిబ్బందికి ట్రైనింగ్ కూడా ఇచ్చింది. ఈ టాయ్స్‌ను నాలుగు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న పిల్లలను దృష్టిలో పెట్టుకుని తయారు చేశారు. ఈ టాయ్స్ ను సెకండరీ స్కూల్ స్థాయి పిల్లలు కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారని ఐలైన్స్ యూకే తన నివేదికలో తెలిపింది.


ప్రతి ఏడాది అక్టోబర్ 8న ప్రపంచవ్యాప్తంగా ‘వరల్డ్ విజన్ డే’ లేదా ‘వరల్డ్ సైట్ డే’గా చెప్పుకునే ఈ రోజును జరుపుకుంటారు. దృష్టి లోపాలు, అంధత్వ సమస్యల గురించి అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ రోజును వరల్డ్ విజన్ డేగా పాటిస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.4 మిలియన్ల మంది పిల్లలు కంటి చూపు సమస్యతో బాధపడుతున్నారని పరిశోధకులు అంచనా వేశారు. అటువంటి పిల్లలకు ఈ బ్రెయిలీ టాయ్స్ ఉపయోగపడనున్నాయి.