Wuhan Lab Researchers : కరోనా వైరస్ వ్యాప్తికి ముందే.. వూహాన్ ల్యాబ్ పరిశోధకులు జబ్బుపడ్డారు!

చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచే కరోనా వైరస్ లీక్ అయిందనే వాదనలు క్రమంగా బలపడుతున్నాయి. దీనికి సంబంధించిన ఆధారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

Wuhan Lab Researchers చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచే కరోనా వైరస్ లీక్ అయిందనే వాదనలు క్రమంగా బలపడుతున్నాయి. దీనికి సంబంధించిన ఆధారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక సంచలన కథనం వెలువరించింది. గతంలో యూఎస్ ఇంటెలిజెన్స్ బయటపెట్టని రిపోర్ట్ ను ఉటంకిస్తూ…కరోనావైరస్(కోవిడ్-19)ప్రపంచవ్యాప్తంగా వ్యాపించడానికి ముందే 2019 నవంబర్ లో వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌ లో పనిచేసే ముగ్గురు పరిశోధకులు జబ్బు పడ్డారని వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది.

వుహాన్ ల్యాబ్‌లో జబ్బు పడిన పరిశోధకుల సంఖ్య, వారు అనారోగ్యానికి గురైన సమయం, ఆస్పత్రిలో వారు పొందిన చికిత్సకు సంబంధించిన విషయాలను ఈ నిఘా రిపోర్టులో వివరించినట్లు తెలిపింది. వూహాన్ ల్యాబ్ నుంచే కరోనావైరస్ వ్యాపించిందంటూ వస్తున్న ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి ఈ నిఘా రిపోర్టులోని సమాచారం బలమైన ఆధారంగా నిలుస్తుందని భావిస్తున్నారు. కరోనా వైరస్ మూలాలపై సంబంధించి తదుపరి విచారణపై చర్చించడానికి డబ్ల్యుహెచ్ఓ నిర్ణయాత్మక విభాగం త్వరలో సమావేశం కానున్న వేళ ఈ రిపోర్ట్ బయటకు రావడం గమనార్హం.

వాల్‌స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన కథనంపై అమెరికా సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధి ఎమిలీ హార్న్ స్పందించడానికి నిరాకరించారు. అయితే కరోనా వైరస్ మూలాల దర్యాప్తుపై బైడెన్ ప్రభుత్వం సీరియస్‌గా ఉందని మాత్రం చెప్పారు. కోవిడ్ మూలాలపై దర్యాప్తు విషయంలో రాజకీయాలు చేయకుండా WHO,ఇతర దేశాల నిపుణులతో కలిసి అమెరికా ప్రభుత్వం పనిచేస్తోందని ఉద్ఘాటించారు.

కాగా, గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఒక టీమ్ మహమ్మారికి సంబంధించిన వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు వుహాన్ వెళ్లింది. అయితే కరోనా వైరస్ వుహాన్ ల్యాబ్ నుంచే వ్యాపించిందనడానికి తగిన ఆధారాలు లేవని తర్వాత WHO చెప్పింది. ఈ దర్యాప్తులో ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందానికి చైనా పూర్తిగా సహకరించలేదని, వుహాన్ ల్యాబ్‌కు సంబంధించిన సమాచారం దాచిపెట్టిందని ఆరోపణలు కూడా ఉన్న విషయం తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు