Mutiny in Russia: అప్పట్లో ఓ ఖైదీ.. ఇప్పుడు సొంత దేశ అధ్యక్షుడినే వణికిస్తున్న ప్రిగోజిన్.. ఇంత ధైర్యం ఎక్కడిది?

యెవ్జెనీ ప్రిగోజిన్ కొన్ని వారాల క్రితం సంచలన ఆరోపణలు గుప్పించారు. అప్పుడే కుట్ర మొదలైంది. తన సైన్య బలాన్ని పెంచుకున్నారు.

Mutiny in Russia – Yevgeny Prigozhin: యెవ్జెనీ ప్రిగోజిన్.. ఆయన వయసు 62 ఏళ్లు. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన మిలటరీ ఉన్న రెండో దేశం రష్యాను పాలిస్తోన్న వ్లాదిమిర్ పుతిన్‌(Vladimir Putin)ను కూడా వణికిస్తున్నారు యెవ్జెనీ ప్రిగోజిన్.

యుక్రెయిన్‌తో రష్యా యుద్ధం చేస్తోన్న వేళ పుతిన్ ముందు ఊహించని ప్రమాదంలా ప్రిగోజిన్ వచ్చిపడ్డారు. ప్రపంచ దృష్టిని ఇప్పుడు తనవవైపునకు తిప్పుకున్న ప్రిగోజిన్ ఎవరు? అంత శక్తిమంతమైన నాయకుడిగా ఎలా ఎదిగారు? రష్యా సైనిక నాయకత్వాన్నే కూల్చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చేంత ధైర్యం ఆయనకు ఎలా వచ్చింది?

రష్యా మిలటరీ నాయకత్వాన్ని కుప్పకూల్చుతా..

వాగ్నెర్ ప్రైవేట్ మిలిటరీ కంపెనీ.. ఇది రష్యాకు చెందిన పారామిలటరీ సంస్థ. ప్రైవేట్ మిలటరీ కంపెనీ (PMC)గానే దీన్ని భావించాలి. రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ప్రైవేట్ ఆర్మీగా పనిచేస్తోంది. వాగ్నెర్ ప్రైవేట్ మిలిటరీ కంపెనీని స్థాపించింది యెవ్జెనీ ప్రిగోజిన్. ఇప్పుడు ఆయనే రష్యా మిలటరీ నాయకత్వాన్ని కుప్పకూల్చుతామని అంటున్నారు.

రెస్టారెంట్ల వ్యాపారం

యెవ్జెనీ చాలా ధనవంతుడు. పుతిన్ కు చాలా సన్నిహితంగా ఉండేవారు. యెవ్జెనీకు రెస్టారెంట్ల వ్యాపారం ఉంది. ఆయనకు చెందిన కాంకర్డ్ క్యాటరింగ్ కు ప్రభుత్వ కాంట్రాక్టులు చాలా వచ్చేవి. 2012లో రష్యా మిలటరీకి ఆహారం అందించే కాంట్రాక్టును కూడా దక్కించుకున్నారు. 2014 నుంచి ఇప్పటివరకు ఆయన వాగ్నెర్ ప్రైవేట్ మిలిటరీ కంపెనీ ద్వారా రష్యాకు మిలటరీ పరంగా సాయం చేస్తున్నారు.

పలు దేశాల్లో ఈ కంపెనీ రష్యా తరఫున కార్యకలాపాలు కొనసాగించింది. యుక్రెయిన్ యుద్ధంలో ఆ దేశంలోని బఖ్ముత్ సహా పలు నగరాలను స్వాధీనం చేసుకోవడంలో విజయాలు సాధించారు. రష్యా ప్రభుత్వం సైన్యం నష్టపోతున్న సమయంలో తన వాగ్నెర్ ప్రైవేట్ మిలిటరీ ద్వారా యెవ్జెనీ ప్రిగోజిన్ కీలక పాత్ర పోషించారు. ఆయన ప్రాభవం క్రమంగా పెరుగుతూ వచ్చింది.

ఖైదీలను సైనికులుగా మార్చి..

యుక్రెయిన్ తో యుద్ధ సమయంలో రష్యా జైళ్లలోని ఖైదీలను తన సైన్యం నియమించుకోవడంలో సఫలమయ్యారు. ఈ ఏడాది ఓ ఇంటర్వ్యూలో ఇందుకు సంబంధించిన వివరాలను ఆయనే స్వయంగా చెప్పారు. మొత్తం 50,000 మంది ఖైదీలను తాను నియమించుకున్నానని తెలిపారు.

బఖ్ముత్ లో చేసిన యుద్ధంలో దాదాపు 10,000 మంది తమ సైనికులు వీరమరణం పొందారని చెప్పుకొచ్చారు. రష్యా సొవియెట్ యూనియన్ గా ఉన్న సమయంలో యెవ్జెనీ ప్రిగోజిన్ చీటింగ్, చోరీ కేసుల్లో దాదాపు పదేళ్లు జైలుకి వెళ్లారు. 1990 దశకంలో ఫాస్ట్ ఫుడ్ కంపెనీని స్థాపించి అందులో విజయవంతమయ్యారు. ఆయనను ” పుతిన్ వంటమనిషి ” గానూ పేర్కొంటారు.

ఆతిథ్య రంగంలో విజయవంతమైన యెవ్జెనీ ప్రిగోజిన్ కంపెనీకి పుతిన్ కూడా ఓ కస్టమరే. మొదట వాగ్నెర్ ప్రైవేట్ మిలటరీ సంస్థకు, తనకు సంబంధం ఏమీ లేదని యెవ్జెనీ ప్రిగోజిన్ చెప్పేవారు. చివరకు, వాగ్నెర్ గ్రూప్ ను స్థాపించింది తానేనని 2021లో అంగీకరించారు.

వివాదం ఇలా మొదలైంది..
వాగ్నెర్ గ్రూప్ ద్వారా తన ప్రైవేట్ సైన్యం సాధించిన విజయాలను తమ విజయాలుగా రష్యా ప్రభుత్వ సైన్యం చెప్పుకుంటోందని యెవ్జెనీ ప్రిగోజిన్ కొన్ని వారాల క్రితం ఆరోపణలు గుప్పించారు. అలాగే, పుతిన్ ప్రభుత్వ అధికారులు కేంద్రీకృత విధానాలను అవలంబిస్తూ భయంకరంగా తయారయ్యారని విమర్శించారు.

రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగుతో పాటు ఇతర సీనియర్ అధికారులపై కూడా ప్రిగోజిన్ విరుచుకుపడ్డారు. తన ప్రైవేటు సైన్యం చావులకు వారే కారణమని అన్నారు. తన సైన్యానికి రష్యా ప్రభుత్వం సరైన మందుగుండు సామగ్రిని అందించలేదని తెలిపారు. యెవ్జెనీ ప్రిగోజిన్ సొంత ప్రయోజనాల కోసం కూడా కుట్ర పన్నుతున్నారా? అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. నేరుగా దేశాధ్యక్షుడు పుతిన్ తోనే ఇప్పుడు పోరాటం చేస్తున్నారు.

అతడిని వదలం: పుతిన్
ప్రిగోజిన్ కు పుతిన్ గట్టిగా హెచ్చరిక చేశారు. తమ ఆర్మీపై తిరుగుబాటు చేసిన వారిని వదలమని చెప్పారు. ప్రిగోజిన్ చేసిన తిరుగుబాటు రాజద్రోహంగా పేర్కొన్నారు. ప్రిగోజిన్ పై రష్యా ప్రభుత్వం క్రిమినల్ కేసు నమోదు చేసింది. యుక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో రష్యాకు ఎదురుదెబ్బలు తగులుతున్న వేళ ఇప్పుడు ప్రిగోజిన్ అంశం మరిన్ని చిక్కులు తెచ్చిపెడుతోంది. మాస్కో అంతటా హైఅలర్ట్ కొనసాగుతోంది.

RUSSIA: రష్యా సైనిక నాయకత్వాన్ని కూల్చివేస్తాం..వాగ్నర్ మెర్సెనరీ గ్రూప్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ ప్రతిజ్ఞ

ట్రెండింగ్ వార్తలు