విరాట్ కోహ్లీకి గురువారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో మ్యాచ్ పరాజయమే కాదు. మరో ఎదురుదెబ్బ తగిలింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీకి రూ.12లక్షల భారీ జరిమానా విధించారు. కేఎల్ రాహుల్ ఇచ్చిన రెండు క్యాచ్‌లు వదిలేసిన కోహ్లీకి.. 97పరుగుల ఓటమి నెత్తిన కూర్చుంది. ఈ మ్యాచ్‌లో కేవలం ఒకే ఒక్క పరుగు తీసిన విరాట్… కాట్రెల్ చేతిలో అవుట్ అయ్యాడు.
17ఓవర్లు మాత్రమే ఆడిన ఆర్సీబీ 109పరుగులు మాత్రమే నమోదు చేయగలిగింది. బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ఫెయిల్ అవడంతో ఆర్సీబీకి ఓటమి తప్పలేదు. ఇక బౌలింగ్ విషయానికొస్తే స్లో ఓవర్ రేట్ భారం కూడా కోహ్లీ నెత్తినపడింది. ఐపీఎల్ కోడ్ నిబంధనలకు విరుద్ధంగా జరగడంతో రూ.12లక్షల జరిమానా విధించారు.
‘అలా జరగడం వల్ల నేను బాధపడుతున్నా. కేఎల్ రాహుల్ ఇచ్చిన రెండు అవకాశాలు వదిలేసుకున్నా. దాని వల్ల 35 నుంచి 40పరుగుల వరకూ చేయగలిగాడు. అప్పుడే అవుట్ చేయగలిగితే వారిని 180పరుగులకే కట్టడి చేసి ఇంత ఒత్తిడికి లోనుకాకుండా ఉండేవాళ్లం. తప్పు ఎక్కడ జరిగిందో మాకు తెలుసు. ఆ రెండు అవకాశాలు వాడుకుని జట్టును ముందుండి నడిపించి ఉండాల్సింది’ అని కోహ్లీ మ్యాచ్ తర్వాత చెప్పుకొచ్చాడు.