IPL 2021- Shivam Mavi: డేల్ స్టెయిన్‌ను కంటతడి పెట్టించిన శివం మావి

కోల్‌కతా నైట్ రైడర్ శివం మావి మాటలకు భావోద్వేగానికి గురైన దక్షిణాఫ్రికా స్పీడ్‌స్టర్‌ డేల్‌ స్టెయిన్‌ కంటతడి పెట్టుకున్నాడు.....

Dsale Steyn Shivam Mavi

IPL 2021- Shivam Mavi: కోల్‌కతా నైట్ రైడర్ శివం మావి మాటలకు భావోద్వేగానికి గురైన దక్షిణాఫ్రికా స్పీడ్‌స్టర్‌ డేల్‌ స్టెయిన్‌ కంటతడి పెట్టుకున్నాడు. ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫో నిర్వహిస్తున్న టీ20 టైమ్‌ఔట్‌ అనే కార్యక్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రాతో పాటు డేల్‌ స్టెయిన్‌ పాల్గొన్నాడు.

అదే కార్యక్రమంలో మాట్లాడిన శివం మావి.. ‘తాను క్రికెట్‌ ఆడటం మొదలుపెట్టినప్పటి నుంచి డేల్‌ స్టెయిన్‌ గేమ్‌ను శ్రద్ధగా గమనిస్తున్నానని చెప్పాడు. బౌలింగ్‌ చేయడం ప్రారంభించినప్పటి నుంచీ అతణ్నే అనుసరిస్తున్నా. అలాగే అవుట్‌ స్వింగర్లు వేయడం ప్రాక్టీసు చేసేవాడిని. బుమ్రా, భువనేశ్వర్‌ బౌలింగ్‌ను కూడా ఫాలో అయ్యేవాడిని. నా రోల్‌మోడల్‌ మాత్రం డేల్‌ స్టెయినే’ అని వివరించాడు.

ఆ మాటలు విని ఉద్వేగానికి లోనైన డేల్‌ స్టెయిన్‌.. కళ్లు చెమర్చాయని, తన ప్రభావం శివంపై ఇంతలా ఉంటుందని ఊహించలేదన్నాడు. ‘నిజంగా అద్భుతం. నిజం చెప్పాలంటే.. తన మాటలకు నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నాకు క్రికెట్‌ ఆడటం అంటే ఇష్టం. అందుకే ఇప్పటికీ ఆటను కొనసాగిస్తున్నా’ అని చెప్పుకొచ్చాడు.

మావి మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడన్న స్టెయిన్‌, ఇలాగే ఆడితే త్వరలోనే టీమిండియాకు సైతం ఆడగలడనే విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. శివం కలలు నిజం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు.. ఐపీఎల్‌-2021లో కేకేఆర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న 22 ఏళ్ల శివం మావి, సోమవారం పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసి 13 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ తీశాడు. అదే మ్యాచ్‌లో కేకేఆర్‌ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.