Samson ipl2021: చివర్లో శాంసన్ చేసింది కరెక్టేనా? సింగిల్ తీసి ఉంటే?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14 వ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తొలి మ్యాచ్‌లో ఓడినప్పటికీ, కొత్త కెప్టెన్ సంజు శాంసన్ మాత్రం బలమైన కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ కింగ్స్‌పై 222 లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శాంసన్.. 119 పరుగులు చేసినా.. జట్టును గెలిపించలేకపోయాడు. ఐపీఎల్ 2021లో సెంచరీ చేసిన తొలి వ్యక్తిగా సంజు నిలవగా.. పంజాబ్‌పై 63 బంతులను ఎదుర్కొంటున్న 12 ఫోర్లు కొట్టి 7 సిక్సర్లు సాయంతో సంజు శాంసన్ 119 పరుగులు చేశాడు.

మ్యాచ్‌లో చివరి బంతిని సిక్సర్ కొట్టే ప్రయత్నంలో అవుట్ అవ్వగా.. అంతకుముందు చివరి ఓవర్‌లో 5వ బంతికి పరుగు తీసే అవకాశం వచ్చినా కూడా శాంసన్ పరుగు తీయలేదు. అర్షదీప్‌ వేసిన ఆఖరి ఓవర్‌లో రాజస్థాన్ విజయానికి 13 పరుగులు చేయాల్సి ఉండగా.. మొదటి మూగు బంతులకు 2పరుగులు మాత్రమే వచ్చాయి. నాల్గో బంతిని శాంసన్ సిక్స్‌గా కొట్టగా.. రెండు బంతుల్లో 5 పరుగులు మాత్రమే చేయవలసిన అవసరం వచ్చింది. కానీ ఐదో బంతికి పరుగు రాలేదు. డీప్‌ ఎక్స్‌ట్రా కవర్‌లో షాట్‌ కొట్టి శాంసన్ పరుగు తీయలేదు. చివరి బంతికి సిక్స్‌ కొడితేనే గెలిచే అవకాశం ఉండగా.. శాంసన్ ప్రయత్నించి అవుట్ అయ్యాడు.

మోరీస్ లాంటి టాప్ ప్లేయర్ రెండవ వైపు ఉన్నప్పుడు శాంసన్ ఎందుకు పరుగు తీయలేదు అనేది ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. శాంసన్ చేసింది కరెక్టే అని కొందరు అంటుంటే.. కాదు అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.. శ్రీలంక మాజీ క్రికెటర్, రాజస్థాన్ కోచ్ కుమార సంగాక్కర శాంసన్ నిర్ణయం కరెక్ట్ అని చెప్పగా.. మోరిస్‌కు స్టైకింగ్‌ ఇచ్చే కంటే సామ్సన్‌ తాడో-పేడో తేల్చుకుంటేనే బెటర్ అని చాలామంది అభిప్రాయపడ్డారు. సెంచెరీ చేసిన ఊపు మీద ఉన్న శాంసన్ చివరి బంతికి సిక్స్ కొట్టగలడు అని అందరూ భావించారు. కానీ అది జరగలేదు.

ఓవర్ కాన్ఫిడెన్స్ అని కూడా కొందరు అంటుండగా.. కొత్త బ్యాట్స్‌మెన్‌కి అవకాశం ఇచ్చి ఛాన్స్ తీసుకోకుండా ధైర్యం చేశాడని సంజయ్ మంజ్రేకర్ కూడా ట్వీట్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు