అప్పు తీర్చలేక కూతురి తాకట్టు.. విడిపించిన మాజీ ఎంపీ!

  • Publish Date - June 2, 2020 / 07:34 AM IST

అప్పులు తీర్చేందుకు కుమార్తెను తాకట్టు పెట్టిందో తల్లి. పొట్టకూటి కోసం కూతురితో కలిసి పట్టణానికి వెళ్లింది. తన గ్రామంలో చేసిన అప్పులు తీర్చేందుకు పట్టణంలో కూలీపని చేస్తోంది. ఒక్కసారిగా తల్లి అనారోగ్యం పాలైంది. మందులు, ఆస్పత్రుల ఖర్చుల కోసం తాను పనిచేసే చోట కొంత డబ్బును అప్పుగా తీసుకుంది. ఆ అప్పు ఎలా తీర్చాలో తెలియక తన కుమార్తెను యజమాని వద్ద తాకట్టు పెట్టింది.

ఇంటికి వెళ్లి వచ్చి అప్పు తీరుస్తానని చెప్పి కుమార్తెను యజమాని వద్ద ఉంచింది. ఆరోగ్యం విషమించడంతో ఆమె మృతిచెందింది. కన్నతల్లి మరణవార్త విన్న బాలిక కడసారి చూసేందుకు ఇంటికి రాలేకపోయింది. విషయం తెలుసుకున్న నవరంగపూర్‌ మాజీ ఎంపీ ప్రదీప్‌ మఝి వెంటనే వారి గ్రామానికి వెళ్లి పూర్తి విషయాలు సేకరించారు. ఒకరిని హైదరాబాద్‌ పంపి ఆ బాలికను విడిపించి తీసుకొచ్చారు. 

నవరంగపూర్‌ జిల్లాకు చెందిన అనాది పాణిగ్రహి భర్త కొన్నేళ్ల క్రితం మరణించాడు. తన ఇద్దరు ఆడబిడ్డలను బాగా చదివించాలన్న ఆశతో మైక్రోఫైనాన్స్‌ కంపెనీ వద్ద రూ.30 వేలు అప్పు తీసుకుంది. ఇద్దరినీ కాలేజీలో చేర్చింది. తీసుకున్న అప్పు తీరలేదు. పెద్ద కుమార్తె ప్రియాంకను గ్రామంలోని బంధువులకు అప్పగించింది. తనతో పాటు చిన్న కుమార్తె సాగరిక (16)ను తీసుకుని 5 నెలల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్‌ వెళ్లింది. ఇటుకల కంపెనీలో పనికి కుదిరారు.

తల్లి అనాది ఆరోగ్యం క్షీణించింది. మందుల కోసం కంపెనీ యజమాని దగ్గర కొంత డబ్బు అప్పుగా తీసుకుంది. కుమార్తె సాగరికను యజమాని వద్ద తాకట్టు పెట్టి గ్రామానికి వెళ్లింది. కొంత కాలానికే  ఆరోగ్యం మరింతగా క్షీణించి మరణించింది. అప్పటికే లాక్‌డౌన్‌  అమలులో ఉండడంతో కుమార్తె సాగరిక తల్లిని చూసేందుకు ఇంటికి రాలేకపోయింది. హైదరాబాద్‌లో తాకట్టులో ఉన్న సాగరిక తన బాధను ఒడిశా ప్రభుత్వానికి వివరించింది. కానీ, ఎలాంటి స్పందించలేదు. ఆ బాలికను రక్షించాలని పలు స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వానికి లేఖలు రాసినా ఫలితం శూన్యం. నవరంగపూర్‌ మాజీ ఎంపీ ప్రదీప్‌ మఝి స్పందించి బాలికను విడిపించారు. 

Read: అక్కాతమ్ముళ్ల డాన్స్ కు నెటిజన్స్ ఫిదా..మట్టిలో మాణిక్యాలంటూ ప్రశంసలు