22 new corona virus cases in suryapet : తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో ఒక వ్యక్తి నుంచి మరో 22 మందికి కరోనా సోకిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనతో అధికారులుఅప్రమత్తమయ్యారు. సూర్యాపేటలోని యాదాద్రి టౌన్ షిప్ లో నివసించే ఓ వృధ్దుడు డిసెంబర్ 24వ తేదీన అనారోగ్యంతో మరణించాడు. ఆయనకు ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఆయన అంత్యక్రియలకు హజరయ్యేందుకు అందరూ వచ్చారు.
అంత్యక్రియల కార్యక్రమం అయ్యేంత వరకు వారంతా ఒకే ఇంట్లో ఉన్నారు. కార్యక్రమం అయ్యాక ఆ వృధ్దుడి కుమారుడికి జలుబు, జ్వరం వచ్చింది. ఆయన అనుమానంతో కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో అప్రమత్తమైన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు..అదే కాలనీలో నివాసం ఉంటూ … అంత్యక్రియలకు హజరైన వారి బంధువులు 33 మందిని గుర్తించి వారకి కరోనా పరీక్షలు నిర్వహించారు. వారిలో 22 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.
ఒకే ప్రాంతంలో ఇంతమందికి వైరస్ సోకటంతో అధికారులు అందరినీ హోం క్వారంటైన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అదే కాలనీలో ఇంటింటికీ సర్వే నిర్వహించి ఆరోగ్యంపై వాకబు చేస్తున్నారు. కాగా కొత్తగా వైరస్ సోకిన వారిలో ఎవరికీ కరోనా లక్షణాలు లేవని అందరూ క్షేమంగానే ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.