తెలంగాణలో కరోనా తోక ముడుస్తోందా ? అంటే ఎస్ అనిపిస్తోంది. ఎందుకంటే రోజురోజుకు కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం వైరస్ ఉధృతి క్రమక్రమంగా తగ్గుతోందని వైద్యులు వెల్లడిస్తున్నారు. గత వారం రోజులుగా 20 లోపు కేసులు నమోదవుతున్నాయి. ఒక్కో రోజు 50 నుంచి 70 కేసులు నమోదైన సంగతి తెలిసిందే.
2020, ఏప్రిల్ 29వ తేదీ బుధవారం 7 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు కూడా..GHMC పరిధిలోనే నమోదయ్యాయి. తాజా కేసులతో కలుపుకుని…రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 1, 016కి పెరిగింది. ఎలాంటి మరణాలు సంభవించలేదు. 409 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ వైరస్ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 25గానే ఉంది. ఆదివారం 11 కేసులు, సోమవారం 2 కేసులు, మంగళవారం 6 కేసులు, బుధవారం 7 కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో 11 జిల్లాను కరోనా రహిత జిల్లాలుగా వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో వరంగల గ్రామీణ, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూలు, ములుగు జిల్లాల్లో కేసులు నమోదైనా కూడా వీరందరూ కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
రాష్ట్రంలో కేసుల వివరాలు : చికిత్స పొందుతున్న వారు 582. డిశ్చార్జ్ అయిన వారు 409. మరణాలు 25. మొత్తం కేసులు 1016.