దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం మరోసారి కరోనా ప్రభావిత ప్రాంతాలను గుర్తించింది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో 5 జిల్లాలను రెడ్ జోన్లుగా కేంద్రం ప్రకటించింది. కర్నూలు, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, కృష్ణా జిల్లాలను రెడ్ జోన్లుగా నోటిఫై చేసింది. ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు నమోదుకాని విజయనగరాన్ని గ్రీన్‌జోన్‌గా డిక్లేర్ చేసింది.
దేశంలో 130 జిల్లాలు రెడ్ జోన్లు, 284 జిల్లాలు ఆరెంజ్ జోన్లు, 319 జిల్లాలు గ్రీన్ జోన్లు:
కొత్త జాబితా ప్రకారం దేశంలోని 130 జిల్లాలను రెడ్ జోన్లుగా, 284 జిల్లాలను ఆరెంజ్ జోన్‌లుగా, 319 జిల్లాలను గ్రీన్ జోన్‌లుగా కేంద్రం గుర్తించింది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 19, మహారాష్ట్రలో 14 జిల్లాలు రెడ్‌జోన్‌లో ఉన్నట్లు కేంద్రం తెలిపింది. తెలంగాణలో ఆరు జిల్లాలు రెడ్‌జోన్‌లో, 18 ఆరెంజ్ జోన్‌లో, 9 జిల్లాలు గ్రీన్‌జోన్‌లో ఉన్నాయి. ఎక్కువ కరోనా కేసులున్న జిల్లాలను హాట్‌స్పాట్(రెడ్‌జోన్).. తక్కువ కరోనా కేసులున్న ప్రాంతాన్ని నాన్ హాట్‌స్పాట్స్‌గా.. ఇప్పటి వరకు ఎలాంటి కరోనా కేసులు నమోదుకాని జిల్లాలను గ్రీన్ జోన్‌లుగా పేర్కొంటారనే విషయం తెలిసిందే. (గ్రీన్ జోన్‌లలో మద్యం అమ్మకాలు)
జూన్ 11 వరకు వేసవి సెలవులు:
రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల పరిధిలో ఉన్న స్కూల్స్ కు జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించారు. లాక్‌డౌన్ కారణంగా పాఠశాలలన్నిటినీ ఇప్పటికే మూసి ఉంచిన సంగతి తెలిసిందే. క్యాలెండర్ ఇయర్ ప్రకారం జూన్ 11 వరకు వేసవి సెలవులను పాఠశాల విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. అయితే స్కూళ్లను ఆ తేదీ తరువాత మళ్లీ ఎప్పుడు తెరిచేది కోవిడ్-19 పరిస్థితిని అనుసరించి ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం తేదీలను తర్వాత ప్రకటిస్తామని పాఠశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.