Accenture Sacks : ఆ ఉద్యోగులకు షాక్ ఇచ్చిన దిగ్గజ ఐటీ కంపెనీ.. జాబ్ నుంచి వేలాది మంది తొలగింపు

ఐటీ దిగ్గజం యాక్సెంచర్ తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. వేలాది మంది ఉద్యోగులను తొలగించింది

Accenture Sacks : ఐటీ దిగ్గజం యాక్సెంచర్ తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. వేలాది మంది ఉద్యోగులను తొలగించింది. తమ ఉద్యోగుల్లో చాలా మంది ఫేక్ డాక్యుమెంట్లు, ఫేక్ ఎక్స్‌పీరియన్స్ లెటర్స్ పెట్టి ఉద్యోగాలు పొందినట్లు యాక్సెంచర్ ఇండియా యూనిట్ కనిపెట్టింది. దీంతో.. భారత్ లో వేలమందిని ఒక్కసారిగా ఉద్యోగం నుంచి తొలగించింది.

”మా సంస్థలో ఉద్యోగం పొందేందుకు మోసపూరిత కంపెనీల నుంచి ఎక్స్ పీరియన్స్ లెటర్లు, ఫేక్ డాక్యుమెంట్లు అందించినట్లు గుర్తించారు. అలాంటి వారిని తొలగించాం. దీని ద్వారా మా క్లయింట్ లకు అందించే మా సేవలపై ఎలాంటి ప్రభావం పడకుండా చర్యలు తీసుకున్నాం” అని సంస్థ వెల్లడించింది.

ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది యాక్సెంచర్ ఇండియా. ఇలా ఫేక్ డాక్యుమెంట్లు తయారుచేయడం, ఫేక్ ఎక్స్‌పీరియెన్స్ లెటర్స్ పెట్టడం నిబంధనలు ఉల్లంఘించడం కంపెనీని మోసం చేయడమేనని చెప్పింది. తాము సిద్ధాంతాలు పాటిస్తామని, ఉల్లంఘించిన వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది. సరైన అర్హత కలిగిన అభ్యర్థులను మాత్రమే తాము నియమించుకుంటామని, అందుకోసం ఎప్పటికప్పుడు నియామకాలు జరుగుతాయని పేర్కొంది. అయితే.. కరోనా సమయంలో ఉద్యోగులను ఎక్కువగా నియమించుకోవాల్సి వచ్చిందని.. వారిలో చాలా మంది ఇలా ఫేక్ సర్టిఫికెట్ల ద్వారా వచ్చారని.. ఇప్పుడు HRలు వారి క్రెడెన్షియల్స్ చెక్ చేసే పనిలో పడ్డారని వివరించింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

కొంత కాలంగా ఐటీ రంగం తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే యాపిల్, గూగుల్, ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా వంటి కంపెనీలు కోట్లాది రూపాయలు నష్టపోయాయి. ఆదాయం భారీగా తగ్గింది. దీంతో ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా ఉద్యోగులను తొలగించుకుంటున్నాయి. ఇది భారత్‌పైనా ప్రభావం చూపిస్తోంది. ఇక్కడ ఐటీ కంపెనీలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. తొలుత టీసీఎస్ ఉద్యోగులకు లే ఆఫ్స్ ఇచ్చినట్లు వార్తలొచ్చాయి. తర్వాత చాలా వరకు టెక్ మహీంద్రా, విప్రో, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు ఫ్రెషర్లకు ఆఫర్ లెటర్స్ ఇచ్చి మళ్లీ వెనక్కి తీసుకున్నట్లు కూడా మీడియాలో వార్తలొచ్చిన విషయం తెలిసిందే.

మరోవైపు ఇదే సమయంలో మూన్‌లైటింగ్ భయాలు పెరిగాయి. అంటే ఒకేసారి రెండు ఉద్యోగాలు చేయడం అన్న మాట. ఇవి పలు ఐటీ కంపెనీలకు తలనొప్పులు తెచ్చిపెట్టాయి. మూన్‌లైటింగ్ అంటే కంపెనీని మోసం చేయడమేనని కొన్ని సంస్థలు అంటున్నాయి. అలాంటి వారిని ఏ మాత్రం ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పాయి. కొన్ని కంపెనీలు మాత్రం మూన్ లైటింగ్ ను సమర్థించాయి. మూన్‌లైటింగ్‌కు తామేం వ్యతిరేకం కాదని చెప్పాయి. దీనిని గిగ్ వర్క్స్‌గా అభివర్ణించాయి. అంటే.. తమ పని లేనప్పుడు.. మేనేజర్ అనుమతి తీసుకొని వేరే పని చేసుకోవచ్చు. అయితే.. తమ ఉత్పాదకతపై ఎలాంటి ప్రభావం పడనప్పుడే ఇది సాధ్యమవుతుందని చెప్పాయి.