రేపే బీహార్ ఎన్నికల ఫలితాలు…పాట్నాలో హస్తం నేతల మకాం

Ahead of Bihar election result, Congress rushes observers to state మూడు దశల్లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు మంగ‌ళ‌వారం(నవంబర్-10,2020)వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపున‌కు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసిన‌ట్లు బీహార్ సీఈసీ హెచ్ఆర్ శ్రీనివాస తెలిపారు. 38 జిల్లాల వ్యాప్తంగా 55 కేంద్రాల్లో 414 హాల్స్‌ను కౌంటింగ్‌కు సిద్ధం చేసినట్లు తెలిపారు. ప్ర‌తి లెక్కింపు కేంద్రంలో కొవిడ్ నిబంధ‌న‌లు పాటించేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని చెప్పారు.



పోలింగ్ కేంద్రాల వ‌ద్ద ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా పోలీసులు భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు. 59 కంపెనీల పారామిల‌ట‌రీ బ‌ల‌గాల‌ను రంగంలోకి దింపారు. స్ర్టాంగ్‌ రూమ్‌ ల దగ్గర 19 కంపెనీల బ‌ల‌గాలు భ‌ద్ర‌త‌లో ఉన్నాయి.



మరోవైపు, బీహార్ లో ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమిదే అధికారం అని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్‌ లో వెల్ల‌డైన విష‌యం తెలిసిందే. ఫ‌లితాలు ఎలా వ‌చ్చినా స‌రే.. సంయ‌మ‌నం పాటించాల‌ని ఆర్జేడీ కార్య‌క‌ర్త‌ల‌కు ఆ పార్టీ నాయ‌కుడు తేజ‌స్వి యాద‌వ్ సూచించారు. ఇక,మహాకూటమిలో భాగస్వామి అయిన కాంగ్రెస్..ఇప్పటికే పార్టీ సీనియర్ నాయకులను బీహార్ కి పంపింది.



https://10tv.in/bihar-assembly-elections-where-is-the-voters-are-exit-polls-real/
ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపై హైకమాండ్ తో చర్చించి నిర్ణయం తీసుకోవడం కోసం కాంగ్రెస్ నాయకులు రణదీప్ సుర్జేవాలా,అవినాష్ పాండే పాట్నా చేరుకున్నారు. మధ్యప్రదేశ్,రాజస్థాన్ రాష్ట్రాలలో జరిగినట్లుగా బీహార్ లో రాజకీయ పరిణామాలను జరగనివ్వకుండా కాంగ్రెస్ అలెర్ట్ గా ఉంది. ఫలితాల సమయంలో ఏ ఒక్క పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే సంఖ్యాబలం లేకుండా హంగ్ అసెంబ్లీ వస్తే..గతంలోలా కాకుండా వేగంగా నిర్ణయాలు తీసుకుని పరిస్థితులను గాడిలో పెట్టేందుకు కాంగ్రెస్ పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉన్నట్లు సమాచారం.



బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జేడీయూ-ఇతర చిన్న పార్టీలు కలిసి పోటీచేయగా..ఆర్‌జేడీ-కాంగ్రెస్-మూడు లెఫ్ట్ పార్టీలు కూటమిగా పోటీచేశాయి. ఇక, కేంద్రంలో ఎన్డీయేలో భాగస్వామి అయినప్పటికీ బీహార్ ఎన్నికల్లో లోక్ జనశక్తి పార్టీ(LJP)స్వతంత్రంగా పోటీ చేసింది.