Alert Another Low Pressure That Will Form Tomorrow
Weather Report: అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుఫాను బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. తుఫాను ప్రభావంతో కేరళ, కర్నాటక, గోవా, గుజరాత్లలో కుండపోత వానలు కురిశాయి. మహారాష్ట్ర, గుజరాత్ సహా పలు రాష్ట్రాలను గడగడలాడించిన అతి భీకర తౌక్టే తుఫాన్ క్రమంగా బలహీనపడి వాయుగుండంగా మారి మెల్లగా క్షిణించింది. తౌక్టే తుఫాన్ గండం నుండి బయటపడి ఊపిరి పీల్చుకుంటుండగానే ఇప్పుడు మరో తుఫాన్ టెన్షన్ పెడుతుంది. మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఈనెల 22న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
రానున్న 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం, దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశం ఉందని తెలిపిన అధికారులు.. ఉత్తర అండమాన్ సముద్రం, దానిని ఆనుకొని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. రేపు ఏర్పడనున్న ఈ అల్పపీడనం బలపడి 24వ తేదీకి తుఫానుగా ఏర్పడే అవకాశముందని వాతావరణశాఖ భావిస్తుంది. ఇది వాయువ్య దిశగా ప్రయాణించి 26న ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరానికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
కాగా, ఈ తుఫాన్ ప్రభావం పెద్దగా తెలుగు రాష్ట్రాలపై ఉండే అవకాశం లేకపోగా తెలంగాణాలో మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో పశ్చిమ దిశ నుండి గాలులు వీస్తుండగా రాగల 3 రోజులు రాష్ట్రంలోని ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. అల్పపీడనం తుఫాన్ గా మారితే వర్షాలతోపాటు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణాలో ప్రజలు కొంత ప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.