Amara Raja Group Shock To Amara Raja Pollution Board Orders Closure Of Plants
Amara Raja Group: ఏపీలో ప్రతిపక్ష టీడీపీలో దూకుడుగా ముందుకు సాగే ఎంపీ గల్లా జయదేవ్. కాగా, ఆయన కుటుంబం దశాబ్దాల నుండే పలు వ్యాపారాలలో సక్సెస్ ఫుల్ గా రాణిస్తోంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లా బేస్ చేసుకొని నడిచే అమరరాజా బ్యాటరీస్ దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకుంది. అయితే.. ఇప్పుడు ఆ అమరరాజా సంస్థకు చెందిన ప్లాంట్లను మూసివేయాలని ఏపీ ప్రభుత్వం షాకిచ్చినట్లుగా తెలుస్తుంది. ఆ సంస్థకు చెందిన చిత్తూరు జిల్లాలోని ప్లాంట్లు మూసివేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశించింది.
అమరరాజా గ్రూప్ సంస్థకు తిరుపతి సమీపంలోని కరకంబాడి, చిత్తూరు దగ్గరున్న నూనెగుండ్లపల్లిలో ఉత్పత్తి ప్లాంట్లు ఉన్నాయి. ఈ రెండు ప్లాంట్ల నుండి మితిమీరి వాతావరణ కాలుష్యమవుతుందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిర్ధారించుకుని రెండు ప్లాంట్లను మూసేయాలని ఆదేశించినట్లు అమరరాజా సంస్థ చెప్పింది. ప్రస్తుతం ప్రభుత్వ ఆదేశాలను పరిశీలిస్తున్నామని వెల్లడించిన సంస్థ భాగస్వాముల ప్రయోజనాల్ని కాపాడేందుకు అన్నీ చర్యలు తీసుకుంటామని ఒక ప్రకటనలో తెలిపింది. ఒక బాధ్యతాయుతమైన కార్పొరేట్ సంస్థగా పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని.. ఉద్యోగుల భద్రత, ఆరోగ్యం సహా అన్ని విషయాల్లో అత్యుత్తమ విధానాలు పాటిస్తున్నామనీ పేర్కొంది.
టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌కు వైసీపీ ప్రభుత్వం షాక్ ఇచ్చే అవకాశం ఉందని చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆ సంస్థకు గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కేటాయించిన భూముల్లో కొన్ని వెనక్కు తీసుకోనే అవకాశం కూడా ఉందని ప్రచారం జరిగింది. కానీ, ఎందుకో గత ఏడాది నుండి అది కేవలం ప్రచారంగా మాత్రమే మిగిలిపోగా.. ఇప్పుడు ఇలా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రూపంలో షాక్ తగిలింది. మరి ఇది కేవలం నోటీసులు, ఆదేశాల వరకే సరిపెట్టుకుంటుందా అనేది చూడాల్సి ఉండగా.. అమరరాజా సంస్థ కూడా కాలుష్యం అంశంలో చర్యలపై దృష్టి పెడుతుందా అన్నది చూడాల్సి ఉంది.
Read: Guru Teg Bahadur: గురు తేగ్ త్యాగం శ్లాఘనీయం.. సెక్యూరిటీ లేకుండా గురుద్వారాకు ప్రధాని!