Rajani Annaatthe
Rajani Annaatthe: దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. రోజుకో మూడు లక్షలకు పైగా కేసులతో దేశం అల్లాడిపోతోంది. దీంతో దేశవ్యాప్తంగా సినిమా షూటింగులకు బ్రేకులు పడ్డాయి. మన తెలుగు సినిమా పరిశ్రమలో కూడా పలువురికి కరోనా సోకడంతో చాలా సినిమాలు ఆగిపోయాయి. అయితే ఒకవైపు కరోనా భయపెడుతున్న రజనీకాంత్ కొత్త సినిమా షూటింగ్ మాత్రం ఆగడం లేదు. రజని తాజా సినిమా అన్నాత్తె హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక జాగ్రత్తల నడుమ షూటింగ్ జరుపుకుంటుంది.
నిజానికి ఈ సినిమాను దీపావళి కానుకగా విడుదల చేస్తామని మేకర్స్ కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. అయితే, కరోనా వలన కొద్ది రోజులు, రజనీకాంత్ ఆరోగ్యం సహకరించకపోవడంతో కొన్ని రోజులు ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు మొదలైంది. కొద్ది రోజుల నుండి ఆర్ఎఫ్సీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా రజనీ కూడా పాల్గొంటున్నారు. కాగా మంగళవారం నుండి హీరోయిన్ నయనతార కూడా పాల్గొంటుంది. చంద్రముఖి, దర్బార్ సినిమాల తర్వాత రజనీ సరసన నయన్ నటిస్తున్న మూడవ సినిమా అన్నాత్తె.
ఈ సినిమా మీద రజనీ అభిమానులలో భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమా కోసం భారీ తారాగణాన్ని తీసుకొచ్చారు దర్శక, నిర్మాతలు. ఈ సినిమాలో జగపతి బాబు విలన్‌గా నటించనుండగా అలనాటి హీరోయిన్స్ ఖుష్బూ, మీనా ప్రత్యేక పాత్రలలో నటిస్తున్నారు. యంగ్ హీరోయిన్ కీర్తి సురేష్ కూడా మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తుంది. కరోనా టైంలోనూ మేకర్స్ వెనక్కు తగ్గకుండా షూటింగ్ పూర్తిచేయాలని చూస్తుండగా ఈ వయసులో రజనీ షూటింగ్ లో పాల్గొనడం సాహసమేనని చెప్పాలి.