Safe Diwali
Diwali Precautions : దీపావళి పర్వదినాన్ని దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. దీపావళి అనగానే ముఖ్యంగా పిల్లల్లో ఎనలేని ఉత్సాహం వస్తుంది. దీపావళి పండుగకు టపాసులు కాల్చే అవకాశం కోసం వారంతా ఎదురుచూస్తుంటారు. టపాసులు కాల్చేందుకు చిన్నారులు చూపే ఉత్సాహం అంతా ఇంతా కాదు. అదే సమయంలో దీపావళి టపాసులు కాల్చే సమయంలో అనుకోని ప్రమాదాలు జరిగి పిల్లలు గాయాలపాలవుతారు. దీపాళి వేడుకల్లో అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటే ఆఇంట్లో పండుగ వేళ విషాదం అలముకుంటుంది. ఇలాంటి పరిస్ధితి రాకుండా ఉండాలంటే ఖచ్ఛితంగా భద్రతా చర్యలు పాటించాల్సిన అవసరం ఉంది. టపాసులు కాల్చే చిన్నారులకు ముందుగానే జాగ్రత్త చర్యలు గురించి వివరించటం మంచిది.
బాణాసంచా కాల్చే సమయంలో చేతి వేళ్లతో పాటు కళ్ళు కూడా అత్యంత ప్రమాదానికి గురయ్యే అవకాశముంది. క్రాకర్స్ కాల్చడం వల్ల చిన్నారులు, గర్భిణులు, ఆస్తమా వ్యాధిగ్రస్తులు, సీనియర్ సిటిజన్లు గాయపడే ప్రమాదం ఉందం ఉంటుంది. అందువల్ల వారు టపాసులకు దూరంగా ఉండటం మంచిది. బాణాసంచాను పేల్చడానికి ముందు, ప్యాకింగ్‌లపై ఉండే సూచనలు చదవండి. అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం గల ప్రాంతాలకు దూరంగా బాణాసంచాను పేల్చాలి. భవనాలు, చెట్లు, పూరిగుడిసెలు , ఎండుగడ్డి లాంటి చోట టపాసులు పేల్చడం వల్ల ప్రమాదాలు వాటిల్లే అవకాశం ఉంటుంది. టపాసులు కాల్చేసమయంలో ముందు జాగ్రత్తగా నీటిని అందుబాటులో ఉంచుకోండి. అనుకోని ప్రమాదం జరిగిన వెంటనే నీటితో తక్షణం మంటలు అర్పేందుకు అవకాశం ఉంటుంది.
గాజు కంటెయినర్లు, లోహపు పాత్రల్లో టపాసులు పేల్చడం సరైనదికాదు. జేబుల్లో టపాసులు పెట్టుకుని తిరగడం చాలా ప్రమాదకరమని గుర్తుంచుకోవాలి. బాణాసంచా ఇంట్లో కాల్చేందుకు ప్రయత్నించవద్దు. బహిరంగ ప్రదేశాల్లోనే టపాసులు కాల్చాలి. పేలకుండా మధ్యలో ఆగిపోయిన టపాసులను తిరిగి వెలిగించే ప్రయత్నం చేయరాదు. అదిపైకి మండకపోయినా లోపల ఉండిపోతే దాన్ని చేతిలోకి తీసుకోగానే పేలిపోయే ప్రమాదం ఉంది. క్రాకర్ రకాల్లో అత్యంత ప్రమాదకరమైనదిగా భావించే బాటిల్ రాకెట్లను అస్సలు కాల్చకండి. వీటి శబ్దం, వెలుతురు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. క్రాకర్లు పేల్చేటప్పుడు కాంటాక్ట్ లెన్సులను అస్సలు ధరించకండి.
నిప్పురవ్వలు పడి చిన్నచిన్న గాయాలు ఏర్పడితే సెప్టిక్ కాకుండా నిరోధించేందుకు బర్నాల్, దూది, అయోడిన్, టించర్, డెటాల్ కూడిన ఫస్ట్ ఎయిడ్ కిట్ సిద్ధంగా ఉంచుకోవాలి. ప్రాధమిక వైద్యం చేసిన ఉపశమనం లభించకపోతే వైద్యుని వద్దకు వెళ్లి పూర్తి చికిత్స చేయించుకోవాలి. పిల్లలు టపాసులు కాల్చేటప్పుడు పెద్దలు వెంట ఉండాలి. దగ్గరుండి వారితో కాల్పించడం అత్యంత శ్రేయస్కరం. పిల్లల చెవుల్లో దూదిపెట్టండి. లేతగా ఉండే వారి కర్ణభేరి చిన్న చిన్న శబ్ధ్దాలకు సైతం ఎక్కువగా స్పందిస్తుంది. బాంబులకు పిల్లలను దూరంగా ఉంచాలి. దీపావళి సామగ్రికి సమీపంలో కొవ్వొత్తులను, అగరువత్తులను ఉంచవద్దు. టపాసులు నాణ్యమైనవి ఎంపిక చేసి లైసెన్సులు కలిగిన డీలర్ల వద్దనే కొనుగోలు చేయాలి.
పిల్లలతోపాటు పెద్దలూ కాటన్ దుస్తులనే ధరించడం మంచిది. పిల్లలకు పొడవైనవి, బాగా లూజుగా వుండే దుస్తులు వేయవద్దు. టపాసులు కాల్చటం కష్టమవుతుంది. బిగువుగా వుండే ప్యాంటు, షర్టు వంటివి వేయండి. వీటితో పిల్లలు టపాసులు కాల్చటం తేలికవుతుంది. ధరించిన దుస్తులపై పడిన నిప్పురవ్వలు మరింత రాజుకొని మంటలు వ్యాపిస్తే వెంటనే ఒంటిపై దుప్పట్లు లేదంటే రగ్గులను కప్పి మంటలను నిరోధించాలి. దుప్పట్లు కప్పడం వల్ల మంటకు ఆక్సిజన్ అందక పైకి వ్యాపించదు. టపాసులను వేడి తగలని ప్రదేశంలో సురక్షితంగా వుంచండి. వీటిని గట్టి మూత గల బాక్సు లో పిల్లలకు అందని చోట భద్రపరచండి. గుంపులున్న చోట, ఇరుకైన ప్రదేశాలలో టపాసులు కాల్చవద్దు. జాగ్రత్త చర్యలు పాటిస్తూ చిన్నారుల చేత పెద్దలు దగ్గరుండి దీపావళి టపాసులు కాల్పించటం వల్ల ఆనందంగా పండుగ జరుపుకునేందుక అవకాశం ఉంటుంది.