Andhrapradesh
Andhrapradesh: ఏపీ శాసన మండలి ప్రొటెం స్పీకర్‌గా విఠపు బాలసుబ్రహ్మణ్యం నియామకం ఖరారైంది. ఇందుకు సంబంధించి సీఎం జగన్ ప్రతిపాదనకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ శుక్రవారం ఆమోదం తెలిపారు. మండలి స్పీకర్ మహమ్మద్ షరీఫ్ తో పాటు మరి కొందరికీ పదవీ కాలం ముగియగా రెండు రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నలుగురు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లకు గవర్నర్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.
కాగా.. ఇప్పుడు వారిచే ప్రమాణ స్వీకారం చేయించేందుకు ప్రొటెం స్పీకర్ నియామకం జరిగింది. మండలికి కొత్త చైర్మన్‌ను ఎన్నుకునే వరకు బాలసుబ్రమణ్యం ఆ పదవిలో కొనసాగనున్నారు. ఇక కొత్తగా లేళ్ల అప్పిరెడ్డి, ఆర్వీ రమేష్‌కుమార్, మోషేన్‌రాజు, తోట త్రిమూర్తులు ఎమ్మెల్సీలుగా మండలిలో అడుగుపెట్టనున్నారు. త్వరలోనే వీరి ప్రమాణస్వీకారం ఉండనుండగా ఆ తర్వాత వీలైనంత త్వరలోనే మండలికి చైర్మన్ ఎంపిక జరగనుంది.
మండలి ఛైర్మన్ తో పాటు వైస్ ఛైర్మన్ పదవులను భర్తీ చేయాల్సి ఉంది. ఇప్పటికే ఛైర్మన్ పదవీ విరమణ చేయగా.. డిప్యూటీ ఛైర్మన్ ఈ నెలలోనే పదవీ కాలం ముగియనుంది. అయితే, మండలి ఛైర్మన్ పదవి ఎవరికి ఇస్తారనే ఉత్కంఠ ఇప్పటి వరకు పార్టీలో కొనసాగుతోంది. అయితే.. ఇప్పటికే ముఖ్యమంత్రి మండలి ఛైర్మన్ అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేసినట్లు పార్టీలో ప్రచారం జరుగుతుంది. మరి సీఎం మనసులో ఉన్న ఆ చైర్మన్ ఎవరో చూడాల్సి ఉంది.