Bengaluru man declared brain dead : బెంగళూరులో ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లగా జరిగి బ్రెయిన్ డెడ్ అయి చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు. దీంతో బంధువులంతా ఘొల్లుమని ఏడ్చారు. అనంతరం సదరు మృతదేహానికి డాక్టర్లు పోస్టుమార్టమ్ నిర్వహించటానికి టేబుల్ పైకి ఎక్కించారు. అన్ని సిద్ధం చేశారు. కొన్ని క్షణాల్లో కత్తితో కోయబోతుండగా సడెన్ గా మృతదేహం అనుకున్న వ్యక్తిలో చలనం కనిపించింది. అతని శరీరంపై రోమాలు నిక్కబొడుచుకోవడంతో పాటు చేతుల్లో కదలికలు వచ్చాయి.
దీంతో పోస్ట్ మార్టం చేయబోతున్న డాక్టర్లతో పాటు అక్కడ ఉండే స్టాఫ్ మొత్తం షాక్ అయ్యారు. షాక్ అయిన డాక్టర్ల్ వెంటనే నోట మాటే రాలేదు. ఏం జరుగుతుందో..ఏం జరగబోతోందో కాసేపు అర్థం కాలేదు. కాసేపటికి తేరుకున్న డాక్టర్ వెంటనే తోటి వైద్య సిబ్బందికి సమాచారం ఇచ్చి వెంటనే చికిత్స ప్రారంభించారు. అనంతరం సదరు వ్యక్తి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ షాకింగ్ ఘటన బెంగళూరులోని ఓ హాస్పిటల్ లో చోటుచేసుకుంది..
కాగా..శంకర్ గోంబి అనే యువకుడు గత ఫిబ్రవరి 27న మహాలింగాపూర్ ప్రాంతంలో ప్రమాదానికి గురయ్యాడు. గాయాలైన అతడిని వెంటనే బెలగావి ఆస్పత్రిలో చేర్చారు. అలా రెండు రోజుల పాటు ఆబ్జర్వేషన్‌లో ఉంచిన డాక్టర్లు ఆఖరికి బ్రెయిన్ డెడ్ అని ప్రకటించారు. అనంతరం అతని బంధువులు కన్నీరు మున్నీరుగా ఏడ్చారు. ఈ క్రమంలో పోస్ట్‌మార్టం నిమిత్తం శంకర్ గోంబిని మహాలింగాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఎస్‌ఎస్ గల్‌గాలి అనే డాక్టర్ నేతృత్వంలో డాక్టర్ల బృందం శంకర్‌కి పోస్ట్‌మార్టం నిర్వహించేందుకు అన్ని సిద్ధం చేసుకున్నారు. మరోపక్క చనిపోయాడనుకున్న శంకర్ కు కుటుంబం అంత్యక్రియలు చేయటానికి ఏర్పాట్లు చేసుకున్నారు. హాస్పిటల్ లో డాక్టర్ల బృందం శంకర్‌కి పోస్ట్‌మార్టం నిర్వహించేందుకు గాను అతడి శరీరాన్ని తాకగానే..అతడిలో చిన్నగా కదలికలు వచ్చాయి. ఆ తరువాత శంకర్ రోమాలు నిక్కబొడుచుకున్నాయి.
దాంతో అక్కడున్న డాక్టర్లంతా షాక్ అయ్యారు. భయపడ్డారు. కాస్త తేరుకున్న సీనియర్ డాక్టర్ శంకర్‌ని మరోసారి పరీక్షించగా మరోసారి షాక్ అయ్యారు… అతడు బతికే ఉన్నాడని నిర్ధారించారు. వెంటనే చికిత్స ప్రారంభించి విషయాన్ని శంకర్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ గల్‌గాలి మాట్లాడుతూ.. నా 18 ఏళ్ల కెరీర్‌లో 400లకు పైగా పోస్ట్‌మార్టమ్‌లు చేసి ఉంటాను. కానీ ఇటువంటి షాకింగ్ కేసు మాత్రం ఇప్పటి వరకూ చూడలేదు. ఫేస్ చేయలేదని తెలిపారు. కొన్ని క్షణాల్లో పోస్ట్ మార్టం చేయబోతున్న వ్యక్తిలో కదలికలు వచ్చేసరికి భయంతో గుండె ఆగినంత పని అయ్యిందని ఆ ఘటనను కాసేపు గుర్తు చేసుకున్నారు.