Covaxin Covishield
Covaxin – Covishield: మన దేశంలో కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సినేషన్ మొదలై ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ప్రజలలో అవగాహనా లేదు. ప్రజలకు అవగాహనా పెంచాల్సిన అధికారులకు అది పట్టడం లేదు. ఫలితంగా ఇప్పటికీ వ్యాక్సిన్లపై అపోహలు.. అనుమానాలతో పాటు అసలు వ్యాక్సిన్ వలన ఉపయోగాలేంటి?.. దానిని ఎలా తీసుకోవాలనేది కూడా తెలియని ప్రజలున్నారు. అలా రెండు రకాల వ్యాక్సిన్లు ఉన్నాయని తెలియని వృద్ధురాలు రెండూ తీసుకోవాలేమోనని క్యూలో నిలబడితే.. వివరాలేమీ అడగకుండా వైద్య సిబ్బంది ఆమెకి రెండు వ్యాక్సిన్లు ఇచ్చి పంపించారు.
బీహార్ రాష్ట్రంలోని పట్నా శివార్లలోని పున్‌పున్ పట్టణం బేల్దారిచల్ ఏరియా అవధ్‌పూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అవధ్‌పూర్ గ్రామానికి చెందిన 65 ఏళ్ల సునీలా దేవి బుధవారం టీకా తీసుకునేందుకు కేంద్రానికి రాగా అక్కడ 18 నుంచి 45 ఏళ్ల వయసు వారికి కొవిషీల్డ్, 45 ఏళ్ళు పైబడిన వారికి కొవాగ్జిన్ టీకాలు ఇస్తున్నారు. ఈ రెండు రకాల టీకాలను ఒకే గదిలో ఇస్తుండటంతో నిరక్షరాస్యురాలైన నీలాదేవి ముందుగా 18 నుంచి 45 ఏళ్ల వయసువారితో క్యూలైన్‌లో నిలబడగా వైద్యుల సమక్షంలో వైద్య సిబ్బంది ఆమెకు కొవిషీల్డ్ టీకా ఇచ్చారు.
అయితే.. కాసేపు అక్కడే పక్కనే కూర్చున్న సునీలా దేవి ఆ తర్వాత 45 ఏళ్ళు పైబడిన వారు నిలబడిన క్యూలైన్ చూసి ఆ టీకా కూడా తీసుకోవాలేమోనని భావించి ఆ క్యూలో నిలబడింది. అక్కడా సిబ్బంది ఆమె గురించి వివరాలేమీ అడగకుండా కొవాగ్జిన్ కూడా ఇచ్చారు. అలా వెంటవెంటనే రెండు రకాల వ్యాక్సిన్లు తీసుకోవడంతో ఆమెకి అప్పుడే జ్వరం రావడంతో ఆమెను 24 గంటలపాటు ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షిస్తుందనే హామీ ఇచ్చి అక్కడ నుండి పంపించారు.
కానీ గంటల సమయం గడిచినా ఎవరూ ఆమె ఆరోగ్య పరిస్థితిని పరిశీలించకపోవడంతో వృద్ధురాలి కుటుంబసభ్యులే సపర్యలు చేశారు. వ్యాక్సినేషన్ విషయంలో పొరపాటు తమదేనని అవధ్‌పూర్‌కు ఏఎన్ఎం అంగీకరించగా.. రెండు వేర్వేరు వ్యాక్సిన్‌లవల్ల నీలాదేవిలో తీవ్ర సమస్యలు ఎదురయ్యే అవకాశం ఏమీ లేదని మెడికల్ ఆఫీసర్ సంజయ్ కుమార్ తెలిపారు.