తెలంగాణలో మరో ఉప ఎన్నికపై కన్నేసిన బీజేపీ… ఊగిసలాటలో చెన్నమనేని రమేశ్‌ పౌరసత్వం

  • Publish Date - December 11, 2020 / 07:48 PM IST

BJP focus another MLA post in Telangana : తెలంగాణలో మరో ఎమ్మెల్యే స్థానంపైనా బీజేపీ కన్నేసింది. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ పౌరసత్వం ఊగిసలాటలో ఉండడంతో.. ఆ స్థానానికి కూడా ఉప ఎన్నిక ఖాయమని బీజేపీ భావిస్తోంది. చెన్నమనేని పౌరసత్వంపై ఈ నెల 16న తీర్పు రానుంది. హైకోర్టు తీర్పును బట్టి చెన్నమనేని రమేశ్‌పై కేంద్ర హోంశాఖ చర్యలు తీసుకోనుంది. ఈ మేరకు రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి బీజేపీ అధిష్టానం సంకేతాలిచ్చినట్లు తెలుస్తోంది. నోముల నర్సింహయ్య మరణంతో ఖాళీ అయిన నాగార్జునసాగర్‌తో పాటు వేములవాడకూ ఆరు నెలల్లోనే ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది.

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ పౌరసత్వంపై ఎంతో కాలంగా వివాదం నడుస్తోంది. గతంలోనే కేంద్ర హోంశాఖ ఆయన పౌరసత్వాన్ని రద్దు చేసింది. జర్మనీ పాస్ పోర్టు కలిగి ఉన్న చెన్నమనేని రమేష్ మోసపూరితంగా భారత పౌరసత్వం పొందారని కేంద్ర హోంశాఖ తేల్చింది. 1955 సిటిజన్ యాక్ట్ ప్రకారం భారత పౌరసత్వానికి అనర్హుడని ప్రకటించింది.

చెన్నమనేని రమేష్ వేములవాడ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మూడుసార్లు ఆయన ఇక్కడి నుంచి ఎన్నికయ్యారు. చెన్నమనేని రమేష్ 1990లో ఉద్యోగం కోసం జర్మనీ వెళ్లారు. 1993లో ఆయన జర్మనీ సిటిజన్ షిప్ పొందారు. దీంతో ఆయన ఇండియన్ పాస్ పోర్టును సరెండర్ చేశారు. 2008లో భారత్ కు తిరిగివచ్చిన ఆయన ఇండియన్ సిటిజన్ షిప్ కోసం మళ్లీ దరఖాస్తు చేయగా… హోంశాఖ మంజూరు చేసింది. 2009లో వేములవాడ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు రమేష్..

ఎన్నికల్లో పోటీ చేసే ముందు భారతదేశ పౌరసత్వాన్ని తిరిగి పొందడానికి నిబంధనలు పాటించకుండా తప్పుడు ధృవపత్రాలను సమర్పించారని రమేష్‌ పై ఆరోపణలు వచ్చాయి. భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేయడానికి ముందు సదరు పౌరుడు ఏడాది పాటు భారత్‌లో ఉండాలి. ఈ విషయంలో చెన్నమనేని రమేష్ పై పోటీ చేసిన ఆది శ్రీనివాస్ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు.

దీంతో కేంద్ర హోంశాఖ రమేష్ బాబు పౌరసత్వంపై ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది. గతంలో రమేష్ బాబు జర్మనీ వెళ్లడం, అక్కడ సాగించిన కార్యకలాపాలపై సమగ్రంగా కమిటి విచారణ చేపట్టింది. కమిటి ఇచ్చిన నివేదిక మేరకు నిబంధనలు పాటించకుండానే భారత పౌరసత్వం రమేష్ బాబు పొందారని ధృవీకరించింది కేంద్ర హోంశాఖ. 2017 డిసెంబర్‌లో కేంద్ర హోంశాఖ రమేష్ బాబు భారత పౌరసత్వాన్ని రద్దు చేసింది. రమేష్‌బాబు రివ్యూ పిటిషన్ దాఖలు చేయడంతో పాటు హైకోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడ నుంచి పోటీ చేసి గెలుపొందారు.

అయితే హోంశాఖ ఆదేశాలను 2019 జూలై 23న హైకోర్టు రద్దు చేసింది. త్రిసభ్య కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌పై పునఃపరిశీలించి 12 వారాల్లో తేల్చాలని హోం శాఖని ఆదేశించింది. మరోసారి చెన్నమనేని వాదనలను విన్న హోంశాఖ రమేశ్‌బాబు పౌరసత్వాన్ని రద్దు చేసింది.