మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో పోలింగ్ పూర్తి.. ఈసారి తగ్గిన ఓటింగ్, ఎంత నమోదైందంటే?
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తైంది. మధ్యప్రదేశ్ లో 71.16 శాతం ఓటింగ్ నమోదు కాగా ఛత్తీస్‌గఢ్‌లో 68.15 శాతం ఓటింగ్ నమోదు అయింది. అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటింగ్ తగ్గింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ లో 75.63 శాతం ఓటింగ్ నమోదు అయింది. ఇక ఛత్తీస్‌గఢ్‌లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 76.88 శాతం ఓటింగ్ నమోదు అయింది. అయితే ఈసారి ఇరు రాష్ట్రాల్లోనూ ఓటింగ్ తగ్గింది. మధ్యప్రదేశ్ లోని 230 అసెంబ్లీ స్థానాలకు ఈరోజు పోలింగ్ జరగ్గా.. ఛత్తీస్‌గఢ్‌లో ఈరోజు రెండవ విడతలో భాగంగా 70 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరిగింది.
తెలంగాణలో కాంగ్రెస్ తుఫాన్
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తుఫాన్ రాబోతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేసిన అనంతరం రాహుల్ మాట్లాడుతూ.. 6 గ్యారంటీలను పక్కా అమలు చేస్తామని అన్నారు.
కాంగ్రెస్ పార్టీది 420 మేనిఫెస్టో
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోపై మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. ఆ పార్టీది 420 మేనిఫెస్టో అని అన్నారు. వారిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఆయన ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి
మాజీ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆమె హస్తం తీర్థం పుచ్చుకున్నారు. ఇంతకు ముందు ఆమె భారతీయ జనతా పార్టీలో ఉన్నారు.
తెలంగాణ ధాన్య భాండాగారం
తెలంగాణలో మూడు కోట్ల టన్నుల ధాన్యం పండుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల అధికారంలో రాష్ట్రాన్ని ధాన్య భాండాగారం చేశామని, పదేళ్ల కష్టాన్ని బూడిదలో పోయకూడదని కేసీఆర్ అన్నారు.
కాంగ్రెస్‌ను నమ్మితే కైలాసమే
కాంగ్రెస్ పార్టీని నమ్మితే కైలామేనని మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. పదేళ్ల బీఆర్ఎస్ కష్టాన్ని బూడిదపాలు చేయొద్దని ఆయన అన్నారు.
ధరణి పోర్టల్ అతిపెద్ద స్కామ్
ధరణి పోర్టల్ అతిపెద్ద స్కామ్ అని కేంద్రమంత్రి జావడేకర్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం నిర్వహించిన ప్రచార ర్యాలీలో మాట్లాడుతూ ధరణి పోర్టల్ మీద సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని అన్నారు.
AP ఫైబర్ గ్రిడ్ కేసులో సీఐడీ పిటిషన్‌పై విచారణ
ఆంధ్రప్రదేశ్ ఫైబర్ గ్రిడ్ కేసులో సీఐడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు విచారణ చేపట్టింది. శుక్రవారం విచారణ అనంతరం తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేస్తున్నట్లు విజయవాడ ఏసీబీ కోర్టు పేర్కొంది.
పదేళ్లలో పేదలకు ఏం చేయని KCR మళ్లీ ఓట్లడగుతున్నారు
రెండుసార్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం.. ఈ పదేళల్లో ప్రజలకు చేసిందేమీ లేదని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెప్పాలని ఆయన కోరారు.
తెలంగాణ ప్రజలకు-ఢిల్లీ దొరలకు మధ్యే ఎన్నికలు
తెలంగాణ ప్రజలకు-ఢిల్లీ దొరలకు మధ్యే ఎన్నికలు జరుగుతున్నాయిని మంత్రి కేటీఆర్ అన్నారు. కరెంట్‌పై మాట్లాడే హక్కు కాంగ్రెస్‌కు లేదని ఆయన విమర్శలు గుప్పించారు.
తెలంగాణలో బీజేపీ గాలి వీస్తోందన్న బండి సంజయ్
తెలంగాణలో బీజేపీ గాలి వీస్తోందని తెలంగాణ బీజేపీ మాజీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తోన్న ఆయన.. శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ కాంగ్రెస్‌కు ఓటేస్తే బీఆర్ఎస్ కు అమ్ముడుపోతారని విమర్శించారు.
పంజాబ్‌లో కొనసాగుతున్న పంట వ్యర్థాల దహనం
దేశ రాజధాని ఢిల్లీ ఒకవైపు కాలుష్య కోరల్లో చిక్కుకున్నప్పటికీ పంజాబ్ రాష్ట్రంలో పంటవ్యర్థాల దహనం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీని వల్ల వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది.
కేసీఆర్‌కు ఓటమి భయం
ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా శుక్రవారం పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇక తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఖర్గే అన్నారు.
కాంగ్రెస్ పార్టీని ప్రజలు క్షమించరు
తెలంగాణకు అన్ని రంగాల్లో కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. దశాబ్దాలు పాలించి, మోసగించిన హస్తం పార్టీని ప్రజలు క్షమించబోరని ఆయన అన్నారు.
లంక భూముల్లో పట్టాలు
అసైన్డ్, లంక భూముల్లో రైతులకు పట్టాలు పంపిణీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఉన్న భూ సమస్యలకు తొందరలోనే పరిష్కారం చూపిస్తున్నామని ఆయన అన్నారు.
బీసీకు కోత పెట్టేందుకు కులగణన
బీసీల పథకాల్లో కోత పెట్టేందుకే కులగణన పేరుతో సర్వే చేస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు అన్నారు. బీసీల స్థితిగతులు మారి, వారికి ప్రయోజనాలు అందాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని ఆయన పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో బలహీన వర్గాలపై దాడులు జరుగుతున్నాయని, అవినీతిని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారన్నారని అచ్చెన్న అన్నారు.
కుల్గామ్‌లో భారీ ఎన్‌కౌంటర్
జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలోని కుల్గామ్‌లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మిలిటెంట్లకు భద్రతా దళాలకు మధ్య జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారి నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
ఉత్తరాఖండ్‌లో ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలోని టన్నెల్ ప్రమాదంలో ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. లోపలనే ఇరుక్కుపోయిన కార్మికులను బయటికి తీసురావాలంటే మరో 40 మీటర్ల శిథిలాలు తొలగించాలన్న అధికారులు చెబుతున్నారు. కాగా, లోపల ఉన్నవారికి పైపుల ద్వారా ఆహారం పంపిస్తున్నారు.