ఢిల్లీలో రైతుల నిరసనలకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మద్దతు..!!

  • Publish Date - December 1, 2020 / 02:46 PM IST

Canada PM Justin Trudeau on Delhi farmer protests : కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. రైతులు చేస్తున్న ఈ నిరసనలకు పలు పార్టీల నేతలు మద్దతు ప్రకటించారు. కానీ తొలిసారిగా..ఢిల్లీ రైతుల నిరసనలపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించారు. శాంతియుతంగా నిరసనలు తెలిపేవారికి కెనడా ఎప్పుడూ మద్దతుగా ఉంటుందని ట్రూడో తెలిపారు. భారతదేశంలో జరుగుతున్న రైతుల నిరసనల గురించి ప్రస్తావించిన తొలి అంతర్జాతీయ నాయకుడు కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో కావటం విశేషం.



ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని..గురునానక్ 551 జయంతి సందర్భంగా ఒక ఆన్ లైన్ కార్యక్రమంలో సిక్కు సమాజానికి చెందిన కెనడియన్లతో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడిన వీడియోను కెనడాలోని సిక్కు సంఘాలు విడుదల చేశాయి. కెనడాలో పంజాబీ సంతతి ప్రజలు ఎక్కువగా ఉంటారు.


ఈక్రమంలో ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులు పంజాబ్ నుంచి తరలివెళ్లినవారే అనే విషయం కూడా తెలిసిందే. ఈక్రమంలో ట్రూడో మాట్లాడుతూ..రైతుల ఆందోళన కార్యక్రమాలకు సంబంధించిన వార్తలు బయటకు వస్తున్నాయని చెప్పారు. వాటిని తాను కూడా తెలుసుకున్నాననీ..నిరసన కార్యక్రమాలను చేస్తున్న రైతుల కుటుంబాల గురించి ఆందోళనగా ఉందని అన్నారు. పూర్తి శాంతియుతంగా తమ హక్కుల కోసం పోరాడే వారి పక్షాన కెనడా ఎప్పుడూ ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేస్తున్నానని ట్రుడో తెలిపారు.



ఈ సమస్యను రైతులు తమ హక్కులను కాపాడుకుంటూనే ప్రభుత్వంత చర్చలు జరపాలని సూచించారు. ప్రభుత్వం కూడా రైతుల హక్కుల గురించి ఆలోచించాలని..రైతులతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఇదే విషయాన్ని ఇండియా అధికారుల దృష్టికి తాము తీసుకెళ్లామని కూడా ఈ సందర్భంగా ట్రుడో తెలిపారు.



రైతుల కుటుంబాల గురించి తమ ఆందోళనను తెలియజేశామని కూడా వెల్లడించారు. అందరం ఏకం కావడానికి ఇది సరైన సమయమని అన్నారు. మరి కెనడా ప్రధాని ట్రూడో వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.