Hero Vijay Master : దళపతి విజయ్ హీరోగా.. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తున్న ప్రెస్టీజియస్ కమర్షియల్ మూవీ ‘మాస్టర్’.. సంక్రాంతికి అంటే జనవరి 13న విడుదల చేయడానికి నిర్మాతలు రెడీ అయ్యారు. అందుకు తగినట్లు తమిళనాడు ప్రభుత్వం కూడా థియేటర్స్ విషయంలో నిర్మాతలకు వెసులుబాటును కల్పించింది. నిజానికి కేంద్రం థియేటర్స్‌ను ఓపెన్ చేసుకునే విషయంలో యాబై శాతం ఆక్యుపెన్సీతో పర్మిషన్ ఇచ్చింది. అయితే అందుకు భిన్నంగా తమిళనాడు ప్రభుత్వం విజయ్ మాస్టర్ సినిమాకు వంద శాతం పర్మిషన్స్ ఇచ్చింది. దీంతో తమిళనాడులో డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ సంతోషపడ్డారు. థియేటర్‌కు రావడానికి ప్రేక్షకుడు భయపడుతున్న ఈ తరుణంలో స్టార్ హీరో సినిమాకు ఇలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు.
అయితే ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే విజయ్ అభిమానులకు, కోలీవుడ్ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ సహా నిర్మాతలకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన 100 శాతం ఆక్యుపెన్సీని ఉపసంహరించుకోవాలంటూ ఆదేశాలను జారీ చేసింది. కోవిడ్ నేపథ్యంలో జన సమ్మర్థం ఎక్కువగా ఉండే థియేటర్స్‌ను దాదాపు ఆరేడు నెలలు మూసేశారు. యాబై శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరిచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యే రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి సమయంలో తమిళనాడు ప్రభుత్వం వంద శాతం అక్యుపెన్సీకి అనుమతి ఇచ్చింది.. అయితే అంతా బావుందనుకుంటున్న సమయంలో నిర్మాతల స్పీడుకు బ్రేకులేస్తూ కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.
గ్జేవియర్ బ్రిట్టో నిర్మాణంలో హోం బ్యానర్ ఎక్స్‌బీ ఫిల్మ్ క్రియేటర్స్ సమర్పణలో సినిమా రెడీ అవుతోంది. ఇందులో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో కనిపించనుండగా, మాళవిక మోహనన్ ఫిమేల్ లీడ్ రోల్ లో కనిపించనున్నారు. ఆండ్రియా జెరెమియా, అర్జున్ దాస్, శాంతను భాగ్యరాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్టోరీ విషయానికొస్తే కాలేజీ డ్రామా అని సమాచారం. మ్యూజిక్ అనిరుధ్ అందిస్తున్నారు.