Central govt simplifies corona vaccine registration process : 2వ దఫా డ్రైరన్‌కు సర్వం సిద్ధమైంది. ఇవాళ దేశంలోని 736 జిల్లాలో డ్రైరన్ జరుగుతోంది. 30 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు సంసిద్ధతను ఈ డ్రైరన్ ద్వారా తెలుసుకోనున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ డ్రైరన్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వాలు అన్ని ఏర్పాట్లు చేశాయి.
కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ ఈనెల 13 నుంచి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ డ్రైరన్ నిర్వహించేందుకు రెడీ అయ్యింది. దేశ వ్యాప్తంగా ఇవాళ 736 జిల్లాల్లో వ్యాక్సిన్ డ్రైరన్‌ను నిర్వహిస్తున్నారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ డ్రైరన్ కొనసాగనుంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో భారీ ఎత్తున డ్రైరన్‌ను నిర్వహించేందుకు అన్ని రాష్ట్రలు, కేంద్ర పాలిత ప్రాంతాలు రెడీ అయ్యాయి. 2వ దఫా డ్రైరన్ కార్యక్రమంలో దాదాపు 30కోట్లకుపైగా వ్యాక్సిన్ ఇచ్చేందుకు సంసిద్ధతను పరిశీలిస్తారు.
టీకా పంపిణీ కోసం ఏర్పాటు చేసిన అన్ని వ్యవస్థల పనితీరును ఈ డ్రైరన్ ద్వారా అధికారులు పరిశీలిస్తారు. వ్యాక్సిన్ ఇవ్వడానికి ముందు ప్రజలు, ఆరోగ్యసిబ్బంది పాటించాల్సిన అంశాలు, టీకా ఇచ్చాక ఏవైనా ప్రతికూల పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులు పరిశీలిస్తారు. తక్షణం అందించాల్సిన చికిత్స గురించి తెలుసుకుంటారు. టీకా తీసుకునే ప్రజలు కేంద్రానికి వచ్చేలా సమీకరించడం, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వరుసల్లో నిలబెట్టడం, వారి నుంచి సమాచారాన్ని తీసుకోవడం ఇందులో చేస్తారు. అంతేకాదు.. వ్యాక్సిన్‌ను తీసుకునే వారి పూర్తి సమాచారాన్ని కొ-విన్ యాప్‌లో ప్రవేశపెట్టడాన్ని పర్యవేక్షిస్తారు. నేరుగా ఒక్క టీకా ఇవ్వడం తప్ప… మిగిలిన అన్ని ప్రక్రియలను అధికారులు పర్యవేక్షిస్తారు.
డ్రైరన్ తొలి విడత ఈనెల 2న జరిగింది. దేశంలోని 116 జిల్లాల్లో డ్రైరన్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. మొత్తం 259 ప్రదేశాల్లో వ్యాక్సినేషన్ మాక్ డ్రిల్ జరిగింది. తొలి విడత డ్రైరన్‌లో 30కోట్ల జనాభాకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు సంసిద్ధతను పరీక్షించారు. ఇప్పుడు మరోసారి ఈ డ్రైరన్ ప్రక్రియ ద్వారా వ్యాక్సినేషన్ కోసం రూపొందించిన కోవిన్ అప్లికేషన్ క్షేత్రస్థాయి పనితీరును పరిశీలిస్తున్నారు.
డ్రైరన్ కోసం తెలుగు రాష్ట్రాలు సర్వం సిద్ధమయ్యాయి. తెలంగాణలో మొత్తం 1,200 సెంటర్లలో డ్రైరన్‌ను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇందుకోసం సర్వం సిద్ధం చేసింది. ఈ డ్రైరన్లను కలెక్టర్లు నేరుగా పర్యవేక్షిస్తారు. జిల్లా, మండల స్థాయి వరకు డ్రైరన్‌ను పరిశీలించేందుకు స్టేట్ లెవల్‌లో మూడు టీములను ఏర్పాటు చేశారు. జిల్లా లెవల్లో మరిన్ని టీమ్‌లు పనిచేస్తాయి. డ్రైరన్ కోసం ఏపీ కూడా రెడీ అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,559సెంటర్లలో డ్రైరన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. తొలి విడత డ్రైరన్‌ను ఏపీ విజయవంతంగా ముగించింది.
కాగా….వ్యాక్సిన్ లబ్ధిదారుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. కోవిన్ యాప్‌లో పేర్లను ఎవరికి వారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మొదట్లో విజ్ఞప్తి చేయగా, ఇప్పుడు దాంతో పాటు మరో రెండు పద్ధతులను అందుబాటులోకి తెచ్చింది. తద్వారా 50 ఏళ్లు పైబడిన వారు, 50 ఏళ్ల లోపు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు సులువుగా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. అన్ని మండలాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ), రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మీసేవ కేంద్రాల్లో ఆయా లబ్ధిదారులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. అందుకోసం పీహెచ్‌సీల్లో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేస్తారు.
అలాగే మీసేవ కేంద్రాల్లోనూ ఏర్పాట్లు చేస్తారు. అక్కడ కూడా కోవిన్ యాప్ ద్వారానే నమోదు ప్రక్రియ జరుగుతుంది. మొదట్లో చెప్పినట్లుగా ఎవరికి వారు సొంతంగా కోవిన్ యాప్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. గ్రామాలు, పట్టణాల్లో సొంతంగా యాప్‌లో నమోదు చేసుకోవడం సాధ్యంకాని వారి కోసం సులభతర ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
అయితే 50 ఏళ్లు పైబడిన వారు తమ పుట్టినతేదీ ధ్రువీకరణ పత్రం తీసుకురావాల్సి ఉంటుంది. అది లేనివారు ఓటర్ గుర్తింపు కార్డు, పాస్‌పోర్ట్ తదితర ప్రభుత్వం ప్రకటించిన నిర్ణీత ఐడీ కార్డులు తెస్తే ఏదో ఒకదాన్ని అప్‌లోడ్ చేసి వారి పేర్లను నమోదు చేస్తారు. వారి పేరు నమోదులో ఎక్కడైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే 1075 నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. ఆ నంబర్ 24 గంటలూ అందుబాటులో ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది.