New Insurance Scheme For Covid Warriors
New Insurance Scheme For Covid Warriors : కరోనా కట్టడిలో కీలకంగా పని చేస్తున్న కొవిడ్ వారియర్స్(వైద్యులు, వైద్య సేవల సిబ్బంది) కోసం కేంద్రం కొత్త బీమా పాలసీని తెస్తోంది. ఇందులో భాగంగా.. కరోనా యోధుల్లో ఎవరైనా మరణిస్తే వారిపై ఆధారపడిన కుటుంబానికి రూ.50లక్షల బీమా అందించనున్నారు. గతేడాది(2020) ఇదే తరహాలో ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ(PMGKP) స్కీమ్ ను కేంద్రం ప్రవేశపెట్టింది. దాని గడువు 2021 ఏప్రిల్ 24తో ముగియనుండగా, త్వరలోనే కొత్త పాలసీపై కేంద్రం ప్రకటన చేయనుంది. ఈ మేరకు న్యూ ఇండియా అష్యూరెన్స్ తో చర్చలు కూడా జరుపుతోంది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని తెలిపింది. గతంలో తీసుకొచ్చిన పాలసీ కింద 287 మందికి ఇన్సూరెన్స్ అందినట్టు తెలిపింది. COVID-19 తో పోరాడుతున్న ఆరోగ్య కార్యకర్తల మనోస్థైర్యాన్ని పెంచడంలో ఈ పథకం కీలకమైన మానసిక పాత్ర పోషించిందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
2020 మార్చి నెల చివరిలో PMGKP స్కీమ్ తెచ్చింది కేంద్రం. ఆ తర్వాత మూడుసార్లు గడువుని పొడిగించారు. 2021 ఏప్రిల్ 24 వరకు అమల్లో ఉంటుంది. COVID-19 వల్ల ఏదైనా ప్రతికూలత ఎదురైతే, వారి కుటుంబాలను జాగ్రత్తగా చూసుకునేలా ఆరోగ్య కార్యకర్తలకు భద్రతా వలయాన్ని అందించడానికి కేంద్రం దీనిని తీసుకొచ్చింది. పిఎంకెజిపి పథకం కింద రూ.50 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. ఈ వ్యాధితో ప్రాణాలు కోల్పోయిన కరోనావైరస్ యోధులపై ఆధారపడిన వారికి ఈ బీమా పథకం భద్రతను కల్పిస్తుంది.
ప్రాణాలను పణంగా పెట్టి హెల్త్ వర్కర్లు విధులు నిర్వహిస్తున్నారు. ఎన్నో త్యాగాలు చేస్తున్నారు. రోజుల తరబడి తమ కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు. కరోనా ప్రాణాంతకం అని తెలిసినా.. విధి నిర్వహణ చేస్తున్నారు. ఈ క్రమంలో వారికి ఏదైనా జరగరానిది జరిగితే, వారి కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు కేంద్రం బీమా పథకం తెచ్చింది.