Centres Rules For States On Lockdowns Containment To Flatten Curve
Centre దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్ననేపథ్యంలో కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు పలు కీలక సూచనలు చేసింది. కోవిడ్ కట్టడిలో భాగంగా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రభావ వంతమైన చర్యలు తీసుకోవాలని హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా సోమవారం రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. ఇలా చేయడం వల్లే వైరస్ వ్యాప్తిని అదుపు చేయగలమని పేర్కొంది.
కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కంటైన్‌మెంట్ జోన్లుగా పరిగణించి ఆంక్షలను తీవ్రతరం చేయడంతో పాటుగా, నియంత్రణ చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా కరోనా పాజిటివ్ రేటు బాగా పెరిగిందని గుర్తు చేశారు. ఇటువంటి తరుణంలో పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి కఠినమైన నియంత్రణ చర్యలను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అమలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇంటెన్సివ్, లోకల్, ఫోకస్డ్ కంటైన్‌మెంట్ ఫ్రేమ్ వర్క్‌ను అమలు చేయాలని సూచించిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు.
జిల్లా, నగరం, వార్డు స్థాయిలో స్థానికంగా ఆంక్షలు విధించవచ్చని లేఖలో పేర్కొన్నారు. కరోనా నియత్రంణ కోసం ప్రత్యేకించిన జిల్లాలు, నగరాలు, వార్డుల వారీగా దృష్టి సారించాల్సి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, జిల్లా అధికారులు జారీచేసిన ఆదేశాలు విస్తృతంగా అమలు అయ్యేలా, ప్రజలు పాటించేలా చూడాలని కోరారు.