కంప్యూటర్ల ముందు గంటల తరబడి పిల్లలు కూర్చొనక్కర్లేదు.. ఆన్‌లైన్ క్లాసుల కోసం SOP వస్తోంది

  • Publish Date - June 13, 2020 / 02:37 PM IST

ఆన్‌లైన్ క్లాసుల కోసం పిల్లలు ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్ ముందు గంటలకొద్ది కూర్చోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP)తో ముందుకు రాబోతోంది. పాఠశాలల్లో డిజిటల్ విద్యను అందించే మార్గాల కోసం మార్గదర్శకాలపై మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పనిచేస్తోంది. రెగ్యులర్ స్కూల్ క్లాసుల మాదిరిగానే ఆన్‌లైన్ క్లాసులను నడుపుతున్న పాఠశాలలపై మంత్రిత్వ శాఖకు ఫిర్యాదులు అందాయి. 

పిల్లలను ఎలక్ట్రానిక్ డివైజ్‌ల ముందు 7 గంటల నుంచి 8 గంటల వరకు కూర్చోబెట్టాల్సి వస్తోందని వాపోతున్నారు. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో పాఠశాలల భవిష్యత్తు గురించి చర్చిస్తున్న అశోక విశ్వవిద్యాలయం K12 వర్చువల్ సమావేశంలో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి అనితా కార్వాల్ మార్గదర్శకాల గురించి మాట్లాడారు.

పాఠశాలల కోసం డిజిటల్ విద్యపై SOPలతో ముందుకు వస్తున్నామని కార్వాల్ చెప్పారు. భారతదేశంలో డిజిటల్ విద్యకు SOPలు లేవు. దీని ఫలితంగా, ప్రతి పాఠశాల దాని స్వంత పద్ధతిని అనుసరిస్తోంది. కొన్ని పాఠశాలలు తమ విద్యార్థులకు జూమ్, గూగుల్ మీట్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా బోధిస్తుండగా, మరికొన్ని పాఠశాలలు వాట్సాప్‌పై ఆధారపడుతున్నాయి. 

డిజిటల్ విద్య కోసం SOP.. పాఠశాలలు అనుసరించడానికి ప్రామాణిక ఆకృతిని సెట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో పాఠశాలలు మిశ్రమ విద్యా నమూనాపై పని చేస్తాయి. పాఠశాలలను తిరిగి తెరవడానికి భద్రతా మార్గదర్శకాలను కూడా HRD మంత్రిత్వ శాఖ సిద్ధం చేసింది. ఇందులో పాఠశాలలు అనుసరించాల్సిన సూచనలు, తరగతి గదుల్లో భౌతిక దూరాన్ని కొనసాగించే మార్గాలు ఉన్నాయి.