China Zhurong: మార్స్ మీద వెయ్యి మీటర్లు ప్రయాణించిన చైనా రోవర్!

ఈ ఏడాది మే నెలలో అంగారక గ్రహంపై చైనాకు చెందిన జురాంగ్ రోవర్ ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. ఈ రోవర్ ఇప్పటి వరకు అంగారక ఉపరితలంపై 1,000 మీటర్లు ప్రయాణించి నిర్ధేశించిన టార్గెట్ ..

China Zhurong

China Zhurong: ఈ ఏడాది మే నెలలో అంగారక గ్రహంపై చైనాకు చెందిన జురాంగ్ రోవర్ ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. ఈ రోవర్ ఇప్పటి వరకు అంగారక ఉపరితలంపై 1,000 మీటర్లు ప్రయాణించి నిర్ధేశించిన టార్గెట్ పూర్తిచేసినట్లు చైనా ప్రకటించింది. చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్పొరేషన్ (CASC) ప్రకారం, జురాంగ్ రోవర్ మార్స్ ఉపరితలంపై 1,000 మీటర్లకు పైగా ప్రయాణించి కొత్త రికార్డు సృష్టించింది. మే 15న అంగారక గ్రహం మీద అడుగుపెట్టిన రోవర్ అంగారక గ్రహంపై వందరోజులు ప్రయాణించింది.

జురాంగ్ రోవర్ సమర్ధవంతంగా దాని అన్ని పనులను పూర్తి చేసిందని చైనా ఇంతకు ముందు ప్రకటించింది. చైనా మార్స్ ఎక్స్‌ప్లోరేషన్ చీఫ్ డిజైనర్ జాంగ్ రోంగ్‌కియావో అన్వేషణను కొనసాగించడానికి రోవర్ మరింత ముందుకు సాగుతుందని తెలియజేసారు. మార్స్ స్థలాకృతి, నేల స్వభావం, వాతావరణం, సంవత్సరం పొడుగునా ఉపరితలం లోపలి పొరల్లో జరిగే మార్పుల గురించి సమగ్రమైన సమాచారాన్ని సేకరించగా తద్వారా మార్స్ గురించి చైనా ఫస్ట్-హ్యాండ్ డాటాను రాబట్టుకుంది. సోలార్ శక్తితో పని చేసే ఈ ఆరు చక్రాల జురాంగ్ రోబో మార్స్ ఉత్తరార్ధగోళంలో విస్తారమైన భూభాగం యుటోపియా ప్లానెటియాను లక్ష్యంగా చేసుకుని పనిచేసింది.

చైనా ఇప్పుడు అంగారకుడిపై వాతావరణాన్ని బాగా అర్థం చేసుకుందని.. CGTN గ్రౌండ్ చీఫ్ డిజైనర్ లియు జియాంజున్‌ను ఉటంకిస్తూ చెప్పారు. చైనా శాస్త్రవేత్తలు ప్రతి నెలా అంగారకుడి నుండి సమాచారాన్ని స్వీకరించబోతున్నట్లు సమాచారం. మిషన్ రోవర్, ఆర్బిటర్ రెండింటి నుండి మట్టి నమూనాలతో సహా 420 గిగాబైట్ల డేటాను సేకరించినట్లు నివేదికలు చెబుతున్నాయి. రోవర్ మరింత అంతరిక్ష పరిశోధనను నిర్ధారించడానికి చైనా శాస్త్రవేత్తలకు సహాయపడటానికి కీలకమైన డేటాను సేకరిస్తుందని భావిస్తున్న ఆ దేశం దాని కోసం బిలియన్ డాలర్లను ధారపోసింది.