China Wuhan: మాస్కులు లేకుండా ఒకేచోట 11 వేలమంది!

నేడు ప్రపంచమంతా అల్లకల్లోలం సృష్టించిన కరోనా మహమ్మారికి పుట్టినిల్లు చైనా దేశంలో వూహన్ నగరమని అందరికీ తెలిసిందే. అక్కడ నుండి కరోనా వైరస్ సృష్టించి వదిలారా? లేక పరీక్షలు జరుగుతుండగా..

China Wuhan: నేడు ప్రపంచమంతా అల్లకల్లోలం సృష్టించిన కరోనా మహమ్మారికి పుట్టినిల్లు చైనా దేశంలో వూహన్ నగరమని అందరికీ తెలిసిందే. అక్కడ నుండి కరోనా వైరస్ సృష్టించి వదిలారా? లేక పరీక్షలు జరుగుతుండగా అది అక్కడ లీకై వ్యాపించిందా అన్నది ఇప్పటికీ తేలని మిస్టరీ కాగా అధికారికంగా మాత్రం ఎక్కడా ధ్రువీకరణ లేదు. కాగా.. ప్రస్తుతం ప్రపంచమంతా కరోనాతో నానాతంటాలు పడుతుంటే చైనాలో మాత్రం వేలాదిమందిని ఒకచోటకు చేర్చి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.

నేడు ప్రపంచమంతా పాటిస్తున్న సామజిక దూరం, మాస్క్ అంశాలను పూర్తిగా పక్కన పెట్టిన చైనా 11 వేలకు పైగా విద్యార్థులను ఒకేచోటకి చేర్చి పండగ చేసుకుంది. వుహాన్‌ నగరంలోని ఓ యూనివర్సిటీ నిర్వహించిన స్నాతకోత్సవంలో 11 వేల మంది విద్యార్థులు మాస్కులు ధరించకుండా, భౌతికదూరం పాటించకుండా పాల్గొన్నారు. గతేడాది డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులను, తాజాగా డిగ్రీ పూర్తిచేసుకున్న విద్యార్థులను కలిపి వుహాన్ యూనివర్సిటీ ఈ స్నాతకోత్సవం నిర్వహించింది.

ఇందుకు సంబంధించిన ఫొటోలు బయటకు రావడంతో ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయి. ప్రపంచంలోని చాలా దేశాలు ఇంకా కరోనా గుప్పిట్లోనే ఉండగా మాస్కులు లేకుండా బయటకు వచ్చేందుకు జనం జంకుతున్నారు. ఇలాంటి సమయంలో వుహాన్‌ యూనివర్సిటీ 11 వేల మంది విద్యార్థులతో, ఎలాంటి కరోనా ఆంక్షలు లేకుండా స్నాతకోత్సవం నిర్వహించడం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది.