తిరుపతికి సీఎం జగన్, దక్షిణాదిలోకి తొలిసారిగా అడుగుపెడుతున్న కాగడా

cm jagan tirupati tour: సీఎం జగన్ నేడు (ఫిబ్రవరి 18,2021) తిరుపతిలో పర్యటించనున్నారు. సాయంత్రం ఆర్మీ అధికారులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. 1971 నాటి భారత్-పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్న ఆర్మీ అధికారి మేజర్ జనరల్ సీ వేణుగోపాల్‌ను సీఎం జగన్ సత్కరించనున్నారు. పోలీస్ గ్రౌండ్స్ లో జరిగే ఈ కార్యక్రమంలో మాజీ సైనికులను సన్మానిస్తారు.

గురువారం మధ్యాహ్నం గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో సీఎం జగన్ తిరుపతికి బయలుదేరుతారు. సాయంత్రం 4.30కు రేణిగుంట ఎయిర్ పోర్టుకి చేరుకుంటారు. 4.50కి తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌కు వెళ్లి మాజీ సైనికుల సన్మాన కార్యక్రమానికి హాజరవుతారు. ఆ తర్వాత తిరుపతిలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. తిరిగి 7.10కి రేణిగుంట విమానాశ్రయం చేరుకుని గన్నవరం పయనం అవుతారు.

భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగి 50ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో మాజీ సైనికులను సన్మానించే కార్యక్రమాన్ని కేంద్రం తలపెట్టింది. స్వర్ణిమ్ విజయ్ మషాల్(Swarnim Vijay Mashaal) పేరుతో 2020 డిసెంబర్ 16న ప్రధాని నరేంద్ర మోదీ కాగడాను వెలిగించారు. ఆ కాగడాను భారత్-పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికులు, ఆర్మీ అధికారులు ఉన్న ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు.

అది దక్షిణాది రాష్ట్రాల్లోకి తొలిసారిగా అడుగుపెడుతోంది. దక్షిణాదిన తిరుపతి నుంచి కాగడా యాత్ర ప్రారంభం అవుతోంది. తిరుపతితో పాటు విశాఖపట్నం, కాకినాడల్లో నివసించే మాజీ సైనికులు సన్యాసి నాయుడు, కేజే క్రిస్టొఫర్ కుటుంబ సభ్యులను కూడా ఆర్మీ అధికారులు సన్మానించనున్నారు. అనంతరం ఈ కాగడా తమిళనాడుకు వెళ్తుంది.