కేంద్రం త్వరలో తీసుకురానున్న పవర్(ఎలక్ట్రిసిటీ) బిల్లు వివాదానికి దారి తీసింది. పలు రాష్ట్రాల సీఎంలు కొత్త కరెంటు బిల్లుపై ఆగ్రహంగా ఉన్నారు. బిల్లుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ బిల్లు పేరుతో రాష్ట్రాల మీద కేంద్రం పెత్తనం చెలాయించాలని చూస్తోందని మండిపడుతున్నారు. రాష్ట్రాల అధికారాలకు కత్తెర వేయాలని చూస్తే ఊరుకునేది లేదంటున్నారు. ఇప్పటికే ఈ పవర్ బిల్లుపై ఏపీ సీఎం జగన్ ఫోకస్ పెట్టారు. ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చిస్తున్నారు. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త కరెంటు బిల్లుపై ఘాటుగా స్పందించారు. కేంద్రం తీరుపై ఆయన ఫైర్ అయ్యారు.
మంగళవారం(మే 5,2020) సీఎం కేసీఆర్ అధ్యక్షతన సుదీర్ఘంగా కేబినెట్ భేటీ జరిగింది. కరోనా నివారణ, లాక్ డౌన్ పొడిగింపు, మద్యం విక్రయాలు, టెన్త్ పరీక్షలు సహా పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇదే సమావేశంలో పవర్ బిల్లుపైనా సీఎం కేసీఆర్ డిస్కస్ చేశారు.
సబ్సిడీ ఇవ్వరు, చార్జీలు పెంచుతారు, ముక్కుపిండి బిల్లులు వసూలు చేస్తారు:
కేంద్రం పవర్ బిల్లు తెస్తోంది. ఇప్పుడు ఈఆర్సీలను అపాయింట్ చేసే అధికారం మనకు ఉంది. ఈ అధికారాన్ని తీసివేస్తారంట. కేంద్రమే అపాయింట్ చేస్తుందట. ఇది అన్యాయం. ఇంతకు ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి జాబితాలోని అంశాలను తీసి కేంద్రం పరిధిలోకి తీసుకొచ్చింది. వాళ్లు ఒక్క ఆకు అంటే, బీజేపీ వాళ్లు రెండాకుల్లాగా ఉన్నారు. బీజేపీ ప్రభుత్వం మొత్తం సెంట్రలైజ్ చేస్తుదంట. ఇది కరెక్ట్ కాదు. వంద శాతం ఫెడరల్ స్పూర్తికి విఘాతం. కేంద్రం తెస్తున్న ఎలక్ట్రిసిటీ బిల్లును చాలా స్ట్రాంగ్‌గా వ్యతిరేకిస్తాం. పార్లమెంటులో భూమిని ఆకాశాన్ని ఒకటి చేస్తాం. ఆ బిల్లు పాస్ కానీయం. ఈ బిల్లు రాష్ట్రాల హక్కులను సమాధి చేస్తుంది.
రైతులకు 24గంటలు కరెంటు ఇవ్వలేము:
మన రాష్ట్రంలో 24 గంటలు రైతులకు ఉచితంగా కరెంటు ఇస్తున్నాం. ఈ బిల్లు వస్తే వాళ్లు చెప్పినట్లు కరెంటు ఇవ్వాలి. ఇందులో పంపిణీ అంతా కూడా ప్రైవేట్‌కు అప్పగించే వ్యవస్థ వస్తుంది. బిల్లులు ముక్కుపిండి వసూలు చేస్తారు. సబ్సిడీ ఇవ్వద్దంట. ఇప్పుడు 24 గంటలు ఇస్తున్నాం. లేదు 14 గంటలే ఇవ్వాలంటే మన రైతులకు ఇచ్చే కరెంటు కట్ చేస్తారా? వ్యవసాయానికి చార్జీ వసూలు చేయాలని చార్జీలు పెడతారా? ఖచ్చితంగా మీటర్లు పెట్టాలంట. కొత్తగా వచ్చే చట్టం ప్రాతిపదిక ప్రకారం వందశాతం మీటర్లు పెట్టాలి. ముక్కుపిండి బిల్లులు వసూలు చేయాలి.. సబ్సిడీ ఇచ్చుకునేది ఉంటే నేరుగా రైతుకు ఇచ్చుకో అంటే.. ఇదేం పద్దతో ముక్కు ఏదంటే వెనుక నుంచి చూపించినట్లుగా ఉంది” అని సీఎం కేసీఆర్ అన్నారు.
అసలు కరెంటు బిల్లు కథ ఏంటి?
దేశవ్యాప్తంగా విద్యుత్ రంగంపై పూర్తి అజమాయిషీ కేంద్రం చేతుల్లోకి వెళ్లనుందనే వార్తలు వస్తున్నాయి. రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఈ రంగాన్ని నిర్వీర్యం చేసేలా చర్యలు తీసుకుంటున్నారని, వాటికి అడ్డుకట్ట వేయాలని కేంద్రం నిర్ణయించిందని సమాచారం. ఈ మేరకు కేంద్ర విద్యుత్ చట్టంలో పలు కీలక సవరణలు తీసుకురానుందని, రాష్ట్రాల అధికారాలకు కత్తెర వేసేలా పలు నిర్ణయాలు తీసుకోనుందని తెలుస్తోంది. ఇందులో భాగంగా కొత్త కరెంటు బిల్లు తీసుకురానుందట. చట్టంలో తీసుకొస్తున్న మార్పులపై రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకోవాలని కేంద్రం నిర్ణయించిందట. కేంద్రం తీసుకొస్తున్న సవరణల్లో రాష్ట్రాల విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) చైర్మన్, ఇద్దరు సభ్యుల నియామకం అత్యంత ప్రధానమైనది. ఇప్పటి వరకూ రాష్ట్రాలే వీరిని నియమిస్తున్నాయి. ఇకపై ఈ నియామకాలు కేంద్రం చేతుల్లోకి వెళ్లనున్నాయి. జాతీయస్థాయిలో సుప్రీంకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి చైర్మన్‌గా.. కొందరు విద్యుత్ రంగ నిపుణులతో కమిటీని వేస్తారు. ఈ కమిటీ రాష్ట్రాల ఈఆర్‌సీ చైర్మన్లు, సభ్యుల పేర్లను సిఫారసు చేస్తుంది. ఈ మేరకు కేంద్రమే ఈఆర్‌సీ చైర్మన్లను, సభ్యులను నియమిస్తుంది. నియంత్రణ మండలి నిర్వహణ వ్యయాలను రాష్ట్రమే భరించాలి, ఆదేశాలనూ పాటించాలి.
రాయితీలతో డిస్కమ్‌లకు సంబంధం ఉండదు:
మరో ముఖ్యమైన సవరణ.. రాష్ట్ర ప్రభుత్వం వివిధ వర్గాలకు ప్రకటించే రాయితీలకు విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కమ్)లు ఏమాత్రమూ బాధ్యత వహించవు. ఉచిత విద్యుత్, పారిశ్రామిక రాయితీలు, ఎస్సీ, ఎస్టీలకు ఇస్తున్న ఉచిత విద్యుత్, గృహాలకు అందిస్తున్న రాయితీతో కూడిన విద్యుత్‌కు ఆయ్యే మొత్తాలను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి. ఇలా చేయడం వల్ల డిస్కమ్‌లు బలపడతాయని కేంద్రం భావిస్తోంది.
పీపీఏల చెల్లింపులపై శాశ్వత విధానం:
ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చాక.. పీపీఏల సమీక్షకు సిద్ధమై.. ధరలను తగ్గించాలని విద్యుదుత్పత్తి సంస్థలకు నోటీసులు జారీచేసింది. అవి హైకోర్టును ఆశ్రయించడంతో పాటు కేంద్రం దగ్గర పంచాయితీ పెట్టాయి. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే..శాశ్వత విధానం ఉండాలని కేంద్రం భావించినట్టు సమాచారం. ఇందుకోసం కేంద్ర పరిధిలో కాంట్రాక్ట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అథారిటీ (సీఈఏ)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీన్ని కూడా ప్రతిపాదిత విద్యుత్ సవరణ చట్టంలో పేర్కొంది. ఒకసారి ఈ అథారిటీ ఏర్పడ్డాక.. రాష్ట్రాలు పీపీఏలను పునఃసమీక్షించేందుకు ఆస్కారం ఉండదు.
దేశమంతటా ఒకే ధర:
కేంద్ర విద్యుత్ చట్టంలో చేసే మరో ముఖ్యమైన సవరణ.. ఒకే దేశం.. ఒకే విద్యుత్ ధర. అంటే ఇకపై కరెంటు ధరలను నిర్ధారించే అధికారం రాష్ట్రాలకు ఏమాత్రమూ ఉండదు. విద్యుత్ పంపిణీ సంస్థలకు నష్టం వాటిల్లుతున్నా.. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కరెంటు ధరలను పెంచకుండా ఉంచడం కుదరదు. ఈఆర్‌సీలతో సమావేశమై.. వాస్తవ ఆదాయ, వ్యయాలను కేంద్రమే సమీక్షిస్తుంది. దేశవ్యాప్తంగా గ్యాస్, పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ఒకే విధంగా ఉండేలా నిర్ధారిస్తున్నట్లుగానే.. ఒకే దేశం.. ఒకే విద్యుత్ ధరను కేంద్రం ఖరారు చేస్తుంది.
Also Read | కేంద్రం తప్పుడు విధానాలే కారణం.. కేసీఆర్ ఫైర్!