భారత్ – చైనా సరిహద్దులో ఉన్న గాల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉండనుంది. ఆ వీరుడి కుటుంబానికి భరోసా ఇవ్వనున్నారు సీఎం కేసీఆర్.
2020, జూన్ 22వ తేదీ సోమవారం సీఎం కేసీఆర్ కల్నల్ సంతోష్ నివాసం ఉంటున్న సూర్యాపేటకు వెళ్లనున్నారు. విద్యానగర్‌లో ఉన్న సంతోష్‌బాబు నివాసానికి వెళ్లి ఆయన తల్లిదండ్రులు మంజుల, ఉపేందర్, భార్య సంతోషిని పరామర్శిస్తారు. సంతోష్ కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని సీఎం కేసీఆర్ అందివ్వనున్నారు.
ఆ కుటుంబానికి రూ. 5 కోట్ల నగదు, ఇంటి స్థలం, గ్రూప్ – 1 ఉద్యోగం ఇస్తామని, తానే స్వయంగా వెళ్లి సాయాన్ని అందచేస్తానని సీఎం కేసీఆర్ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే.
సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంత్రి జగదీష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సీఎం వస్తున్నారనే సమాచారం మేరకు భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, నేతలు వచ్చే అవకాశం ఉండడంతో కరోనా నేపథ్యంలో ఎవరూ రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.