అమర్ రహే సంతోష్ బాబు..భారత్ మాతాకీ జై..నినాదాలతో సూర్యాపేట పట్టణం మారుమ్రోగింది. భరత మాత ముద్దుబిడ్డ, వీరమరణం పొందిన సంతోష్ ను కడసారి చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. దీంతో సూర్యాపేట పట్టణంలో ఆయన నివాసం కిక్కిరిసిపోయింది. చైనా సైనికులు చేసిన దాడిలో ఆయన కన్నుమూసిన సంగతి తెలిసిందే.
బుధవారం రాత్రి సంతష్ బాబు పార్థీవ దేహాన్ని తీసుకొచ్చారు. 2020, జూన్ 18వ తేదీ గురువారం ఉదయం ఆయన అంతిమయాత్ర ప్రారంభమైంది. ఆర్మీ అధికారుల సూచనలతో అంతిమయాత్ర జరుగుతోంది. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగనున్నాయి. ఉదయం ఆయన నివాసానికి ప్రజలు పోటెత్తారు. కానీ కోవిడ్ నిబంధనలు, ఆర్మీ అధికారుల సూచనలతో కొంతమందిని మాత్రమే అనుమతించారు. పొలిటికల్ నేతలు ఘనంగా నివాళులర్పించారు. ఆర్మీ అధికారుల డ్రిల్ అనంతరం అంతిమయాత్ర ప్రారంభమైంది.
ముందు వరుసలో ఆర్మీ అధికారులు ఉండగా..వెనుక స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భారత్ మాతాకీ జై..అమర్ రహే..సంతోష్ బాబు నినాదాలతో మారుమోగింది. అంతిమయాత్ర నిర్వహిస్తున్న వాహనంపై పెద్ద ఎత్తున్న పూలు చల్లుతూ…జోహార్..అంటూ ఘనంగా నివాళులర్పించారు. దాడి పొడవునా..నిలబడ్డ ప్రజలు..జాతీయ పతాకాన్ని చూపెడుతూ..కన్నీటి వీడ్కోలు పలికారు. స్థానికులు స్వచ్చందంగా బంద్ పాటించారు.
భారత్ – చైనా సరిహద్దుల్లో సోమవారం రాత్రి జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులైన సంగతి తెలిసిందే. అందులో సూర్యాపేట ప్రాంతానికి చెందిన కల్నల్ సంతోష్ బాబు కూడా ఉన్నారు. మంగళవారం మధ్యాహ్నం ఆర్మీ అధికారులు ఆయన కుటుంబసభ్యులకు సమాచారాన్ని అందించారు. అప్పటి నుంచి తీవ్ర విషాదంలో మునిగిపోయోని కుటుంబసభ్యులు సంతోష్ ను చివరి సారిగా చూసేందుకు తల్లడిల్లిపోయారు. తర్వాత వచ్చిన సంతోష్ పార్థీవ దేహాన్ని చూసిన తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కుప్పకూలిపోయారు.
కొన్ని సంవత్సరాలుగా ఇంటికి దూరంగా ఉంటూ దేశానికి సేవ చేసిన కొడుకు వీరమణం పొందడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. సంతోష్ బాబు తల్లి మంజుల, తండ్రి ఉపేందర్, భార్య సంతోషిని, ఆ కుటుంబాన్ని ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. దేశం ఒక వీరుడుని కోల్పోయిందని తల్లి వెల్లడించింది. సంతోష్ బాబుకు కన్నీటి వీడ్కోలు పలికారు.