Corona Second Wave: అమానుషం.. డిజిటల్ చెల్లింపులు చెల్లవని రోగిని చేర్చుకొని ఆసుపత్రి

దేశంలో కరోనా సెకండ్ వేవ్ అల్లకల్లోలం సృష్టిస్తుంటే ప్రజలు భయం గుప్పిట్లో బిక్కుబిక్కు మంటూ బ్రతుకుతున్నారు. కరోనా అనగానే ప్రజలలో ఒకరకమైన భయం కొనసాగుతుండగా ఈ భయాన్ని కొన్ని ఆసుపత్రులు, టెస్టింగ్ సెంటర్లు క్యాష్ చేసుకుంటున్నాయి.

Corona Second Wave: దేశంలో కరోనా సెకండ్ వేవ్ అల్లకల్లోలం సృష్టిస్తుంటే ప్రజలు భయం గుప్పిట్లో బిక్కుబిక్కు మంటూ బ్రతుకుతున్నారు. కరోనా అనగానే ప్రజలలో ఒకరకమైన భయం కొనసాగుతుండగా ఈ భయాన్ని కొన్ని ఆసుపత్రులు, టెస్టింగ్ సెంటర్లు క్యాష్ చేసుకుంటున్నాయి. మరోవైపు ప్రభుత్వాలు కరోనా చికిత్సలో ఆసుపత్రులు ఉదారంగా వ్యవహరించాలని హెచ్చరించినా కొందరు పెడచెవిన పెట్టి కాసులే పరమావధిగా రోగులను పీడిస్తున్నారు. తమ వద్ద డబ్బు లేదని డిజిటల్ పేమెంట్ చేస్తామన్నా వినిపించుకొని ఆసుపత్రి ఓన్లీ క్యాష్ అంటూ రోగిని ఆసుపత్రి ఎదుటే నిలిపివేసింది.

రోగి బంధువులు డబ్బు కోసం ఏటీఎంల చుట్టూ తిరిగుతుండగానే ఆసుపత్రి ఎదుటే రోగి ప్రాణం పోయింది. ఈ అమానవీయ ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కరోనా సోకిన అంజలి అనే మహిళను జిల్లాలోని జీఎంఆర్ వరలక్ష్మి కేర్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. కరోనా చికిత్స కోసం వచ్చిన మహిళను ముందుగా డబ్బు కట్టాలని ఆసుపత్రి సిబ్బంది డిమాండ్ చేసింది. రోగి బంధువులు తమ వద్ద క్యాష్ లేదని డిజిటల్ పేమెంట్ చేస్తామని బ్రతిమాలినా కేవలం నగదు మాత్రమే తీసుకుంటామని ఆసుపత్రి సిబ్బంది ఖరాకండీగా చెప్పేశారు. దీంతో రోగిని ఆసుపత్రి బయటే ఉంచిన బంధువులు డబ్బు కోసం ఏటీఎంకు వెళ్లారు.

మధ్యాహ్నం తర్వాత లాక్ డౌన్ నడుస్తుండడంతో ఏటీఎంలలో నగదు అయిపొయింది. దీంతో పరుగుల మీద వారు ఏటీఎంల చుట్టూ తిరుగుతున్నారు. మూడు గంటల సమయం గడిచినా నగదు దొరకలేదు. రోగిని ఆసుపత్రిలో చేర్చుకోలేదు. చివరికి ఆ మహిళా పేషేంట్ నడిరోడ్డుపైనే ప్రాణాలు విడిచింది. ఊపిరి పోయాక కనీసం మృతదేహాన్ని తరలించడానికి కూడా ఆసుపత్రి సిబ్బంది సహాయం చేయలేదు. చుట్టుపక్కల ప్రజలు కూడా ఎవరూ ముందుకురాలేదు. ఆసుపత్రి సిబ్బంది వల్లే తమ మనిషి చనిపోయిందంటూ రోగి బంధువులు ఆవేదన స్థానికంగా అందరినీ కలచివేసింది. 108కు కాల్ చేసినా స్పందించలేదంటూ ప్రభుత్వంపై కూడా మండిపడుతున్నారు. ఈ మహిళా రోగి మృతి ఘటన, ఆసుపత్రి నిర్లక్ష్యంపై జిల్లా వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు