Corona Virus: కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ఉంటేనే పెళ్లి.. ఎక్కడంటే?

రాష్ట్రానికి ఒక విధంగా ఆంక్షలలో తేడాలు ఉంటున్నా దేశమంతటా ఆంక్షలయితే అమల్లోనే ఉంటున్నాయి. రాష్ట్రాలలో పరిస్థితిని బట్టి లాక్ డౌన్ సడలింపు సమయాలతో పాటు పెళ్లిళ్లు, శుభకార్యాలు..

Corona Virus: రాష్ట్రానికి ఒక విధంగా ఆంక్షలలో తేడాలు ఉంటున్నా దేశమంతటా ఆంక్షలయితే అమల్లోనే ఉంటున్నాయి. రాష్ట్రాలలో పరిస్థితిని బట్టి లాక్ డౌన్ సడలింపు సమయాలతో పాటు పెళ్లిళ్లు, శుభకార్యాలు, కర్మకాండలు ఇలా తప్పని వాటికి పరిమిత సంఖ్యలో హాజరుతో అనుమతులిస్తున్నారు. అయితే ఒకచోట మాత్రం కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలి.. అలా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ఉంటేనే పెళ్లికి అనుమతిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లా వరాసియోనీ పట్టణంలో అధికారులు ఈ రూల్ అమలు చేస్తున్నారు.

పెళ్లి చేసుకోవాలని అనుకునే వధూవరులు ఇద్దరూ రెండు వారాల క్రితమే వ్యాక్సిన్ తీసుకోవాలని.. అలా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తెస్తేనే పెళ్లికి అనుమతి ఇస్తామని అధికారులు చెప్తున్నారు. మిగతా రాష్ట్రాల మాదిరే ఇక్కడ కూడా కొద్దిమంది హాజరు నిబంధనతో పెళ్లిళ్లకు అనుమతిస్తున్నారు. అయితే.. వారాసియోనీ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ సందీప్ సింగ్ మాత్రం కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ఉంటేనే పెళ్ళికి అనుమతిస్తున్నారు. వధూవరులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా వ్యాక్సిన్ వేయించుకున్నట్లుగా సర్టిఫికెట్లు చూపించాలని నిబంధన పెట్టారు.

వ్యాక్సినేషన్ ప్రోత్సహించేందుకు ఈ తరహా నిబంధనను తీసుకొచ్చామని అధికారులు చెప్తుండగా.. ఈ నిబంధనపై వరాసియోనీ ప్రజలు మాత్రం మండిపడుతున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడే ఈ తరహా నిబంధనలు అమలు చేయడం ఏమిటని పెళ్లి చేసుకోవాలనుకునే యువతీ, యువకుల కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 45 ఏళ్ల లోపు వారికి వ్యాక్సిన్ దొరకడం కష్టంగా ఉండగా వ్యాక్సిన్ తీసుకోకపోతే పెళ్ళికి అనుమతి ఇవ్వకపోవడం దారుణమని వాపోతున్నారు.

ట్రెండింగ్ వార్తలు