Excise Policy Case: "Not the first case of corruption against AAP...", Union Minister Anurag Thakur
CBI Probe: అవినీతి మంత్రులు రాజీనామా చేయాల్సిందేనని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. ఢిల్లీలో గత ఏడాది నవంబరు 17 నుంచి అమలు చేస్తున్న వివాదాస్పద కొత్త ఎక్సైజ్ పాలసీపై కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. ఇందులో డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పేరు కూడా ఉంది. అయితే, కేంద్ర దర్యాప్తు బృందాలను వాడుకుంటూ తమను అణచివేయాలని ఎన్డీఏ సర్కారు కుట్రలు పన్నుతోందని సీఎం కేజ్రీవాల్, ఆప్ నేతలు చేస్తోన్న వ్యాఖ్యలపై అనురాగ్ ఠాకూర్ స్పందిస్తూ వాటిని తిప్పికొట్టారు.
”అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణ కోసం కేంద్ర హోం శాఖకు లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా చేసిన సిఫార్సుపై కేజ్రీవాల్ మౌనంగా ఉన్నారు. దీన్నిబట్టి కేజ్రీవాల్‌కు తెలిసే అవినీతి జరిగిందని స్పష్టమవుతోంది. సత్యేందర్ జైన్‌పై కూడా ఆరోపణలు ఉన్నాయి. ఆయనకు జైలులో జ్ఞాపకశక్తి పోయిందట. మనీశ్ సిసోడియాకు కూడా జ్ఞాపకశక్తి పోతుందా? ఢిల్లీ ప్రభుత్వంలో ఒకదాని తర్వాత మరో అవినీతి బయటపడుతోంది.
రాజకీయాల్లోకి ప్రవేశించేముందు అవినీతి నిర్మూలన గురించి కేజ్రీవాల్ ఎన్నో మాటలు చెప్పారు. ఇప్పుడు ఆయన ప్రభుత్వం అవినీతిలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఢిల్లీ ప్రభుత్వ అవినీతి గురించి అడుగుతున్న ప్రశ్నలకు కేజ్రీవాల్ సమాధానం చెప్పలేకపోతున్నారు. అవినీతి మంత్రులు రాజీనామా చేయాల్సిందే. మీలాంటి అవినీతిపరులకు అధికారంలో ఉండే హక్కు లేదు” అని అనురాగ్ ఠాకూర్ విమర్శలు గుప్పించారు.