Covid In Indai : వారం రోజుల్లో,9 రాష్ట్రాల్లో..1700 మంది డాక్ట‌ర్ల‌కు క‌రోనా..

దేశవ్యాప్తంగా కరోనా వేగంగా వ్యాపిస్తోంది. కేవలం వారం రోజుల్లో,9 రాష్ట్రాల్లో..1700 మంది డాక్ట‌ర్ల‌కు క‌రోనా బారినపడ్డారు.

Covid In Indai

Covid In Indai: Corona for 1700 doctors in 9 states : భారత్ లో కరోనా థర్డ్ వేవ్ అత్యంతవేగంగా వ్యాపిస్తోంది. రోజురోజుకు క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. వందలాదిమంది డాక్ట‌ర్ల‌ు మహమ్మారికి గురవుతున్నారు.డాక్టర్లతో పాటు హెల్త్ కేర్ వ‌ర్క‌ర్స్‌కు కూడా ఈ వైర‌స్ బారిన ప‌డటం ఆందోళన కలిగిస్తోంది. వారం రోజుల వ్య‌వ‌ధిలోనే మొత్తం 9 రాష్ట్రాల్లో 1700 మంది డాక్ట‌ర్లు, హెల్త్ కేర్ వ‌ర్క‌ర్ల‌కు క‌రోనా పాజిటివ్‌గా తేలింది. కరోనా ఉదృతి చూస్తుంటే మరిన్ని పాజిటివ్ కేసులు పెరిగే అవకాశాలున్నాయి.

ఓ పక్క కరోనా..మరోపక్క కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రతాపం చూపుతున్నాయి. దీంతో ఒమిక్రాన్ ప‌ట్ల నిర్ల‌క్ష్యంగా ఉండొద్ద‌ని ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చ‌రిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ డేంజ‌ర‌స్ అని ఇప్పటికే డ‌బ్ల్యూహెచ్‌వో కూడా హెచ్చరించింది. ఇటువంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా వందలాదిమంది డాక్టర్లు ఈ మహమ్మారి బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. కేవలం వారం రోజుల్లో తొమ్మిది రాష్ట్రాల్లో 1700 మంది డాక్టర్లు కరోనా బారిన పడ్డారు.

  • పశ్చిమబెంగాల్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 400 మంది డాక్ట‌ర్లు, మెడిక‌ల్ స్టాఫ్ క‌రోనా బారిన ప‌డ్డారు. క‌ల‌క‌త్తా మెడిక‌ల్ కాలేజీ, క‌ల‌క‌త్తా నేష‌న్ మెడిక‌ల్ కాలేజీ, ఎన్ఆర్ఎస్ హాస్పిట‌ల్‌లో కేసులు ఎక్కువగా న‌మోదయ్యాయి. 
  • బీహార్‌లో 300 మంది డాక్టర్లకు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. న‌లంద మెడిక‌ల్ కాలేజీతో పాటు అనుగ్ర‌హ్ నారాయ‌ణ్ మ‌గ‌ధ్ మెడిక‌ల్ కాలేజీలో క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి.
  • మ‌హారాష్ట్ర‌లోని ముంబై కరోనాకు నిలయంగా మారుతోందా? అనిపిస్తోంది. దేశ వాణిజ్యరాజధాని ముంబైలో కూడా ఎంతోమంది డాక్టర్లు కోవిడ్ బారిన పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 300 మంది వైద్యులు క‌రోనా బారిన ప‌డగా..సియాన్ ఆస్ప‌త్రిలోనే 98 మంది డాక్ట‌ర్ల‌కు కొవిడ్ సోకింది. అలాగే జేజే హాస్పిట‌ల్‌లో 83 మంది,కేఈఎమ్ హాస్పిట‌ల్‌లో 73 మంది, నాయ‌ర్ ఆస్ప‌త్రిలో 59 మంది డాక్టర్లకు క‌రోనా సోకింది.
  • అలాగే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో 75 మంది డాక్ట‌ర్లు, హెల్త్ కేర్ వ‌ర్క‌ర్ల‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. ల‌క్నోలోని మేధాంత ఆస్ప‌త్రిలో 56 మంది వైద్యుల‌కు క‌రోనా సోకింది. లోక్‌బంధు ఆస్ప‌త్రిలో ముగ్గురికి, కేజీఎంయూ ఆస్ప‌త్రిలో 6గురు క‌రోనాకోవిడ్ బారిన ప‌డ్డారు.
  • జార్ఖండ్‌లో మొత్తం 179 మంది ఆరోగ్య శాఖ సిబ్బంది క‌రోనా బారిన ప‌డ‌గా, ఇందులో డాక్ట‌ర్లు, న‌ర్సులు ఉన్నారు.
    చండీఘ‌ర్‌లో 196 మంది డాక్ట‌ర్లు, పారామెడిక‌ల్ స్టాఫ్ క‌రోనా పాజిటివ్‌గా ప‌రీక్షించ‌బ‌డ్డారు. వీరంతా పీజీఐ, సిటీ ఆస్ప‌త్రుల్లో ప‌ని చేస్తున్న వారు.
  • ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాజ‌ధాని రాయ్‌పూర్ ఎయిమ్స్‌లో 33 మంది డాక్ట‌ర్ల‌కు కొవిడ్ సోకింది. బిలాస్‌పూర్‌లో 40 మంది డాక్ట‌ర్లు, 35 మంది న‌ర్సులు, మ‌రో 30 మంది వ‌ర్క‌ర్లు క‌రోనా బారిన ప‌డ్డారు. రాయ్‌ఘ‌ర్‌లోని ల‌ఖిరామ్ మెడిక‌ల్ కాలేజీలో ముగ్గురు డాక్ట‌ర్ల‌కు కొవిడ్ సోక‌గా, రాజ్‌నంద్‌గావ్ పెండ్రి మెడిక‌ల్ కాలేజీలో 14 మంది వైద్యులు క‌రోనా పాజిటివ్‌గా ప‌రీక్షించ‌బ‌డ్డారు.
  • రాజ‌స్థాన్‌లో 48 మంది డాక్ట‌ర్లు, న‌ర్సుల‌కు క‌రోనా సోకింది. ఢిల్లీలోని ప‌లు ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో ప‌ని చేస్తున్న 100 మంది ఆరోగ్య శాఖ అధికారులు క‌రోనా బారిన ప‌డ్డారు. క‌రోనా నివార‌ణ‌కు ఢిల్లీలో వారాంత‌పు క‌ర్ఫ్యూ విధించిన సంగ‌తి తెలిసిందే.

ఇలా దేశ వ్యాప్తంగా పలువురు డాక్టర్లు కోవిడ్ బారినపడుతున్నారు. డాక్టర్లతో పాటు మెడికల్ సిబ్బంది కూడా కోవిడ్ కు గురవుతున్నారు. కాబట్టి ప్రతీ ఒక్కరు ఈ థర్డ్ వేవ్ లో జాగ్రత్తలు తీసుకోకపోతే పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఒమిక్రాన్ విషయంలో ఏమాత్రం అజాగ్రత్త వద్దని హెచ్చరిస్తున్నారు.