తిరుమల శ్రీవారికి భక్తుడి భారీ కానుక, 2 కోట్ల విలువైన శంఖు చక్రాలు విరాళం

devotee gifts gold shanku chakras to tirumala srivaru: కలియుగ దైవం, తిరుమలలో కొలువుదీరిన శ్రీవేంకటేశ్వర స్వామి వారికి తమిళనాడుకి చెందిన భక్తుడు తంగదొరై భారీ కానుక సమర్పించాడు. బంగారు శంఖు, చక్రాలను విరాళంగా ఇచ్చాడు. వాటి విలువ 2కోట్లు. 3.5 కిలోల బంగారంతో స్వామివారికి శంఖు చక్రాలు చేయించినట్లు తంగదొరై తెలిపాడు.

బుధవారం(ఫిబ్రవరి 24,2021) ఉదయం శ్రీవారి ఆలయంలో అదనపు ఈవోకు ఆభరణాలు అందజేశాడు. తంగదొరై గతంలోనూ శ్రీవారికి బంగారు, వజ్రాభరణాలను విరాళంగా ఇచ్చాడు. అందులో బంగారు కటి, వరద హస్తాలు, వడ్డాణం ఉన్నాయి.

తిరుమల శ్రీవారికి నిత్యం ఎంతో విలువైన కానుకలు వస్తుంటాయి. బంగారం, వెండి ఆభరణాలతో పాటు వజ్రవైడుర్యాలను భక్తులు సమర్పిస్తుంటారు. కొందరు భూములను రాసిస్తుంటారు. ఇప్పటికే చాలామంది భక్తులు భారీ కానుకలు స్వామివారికి కానుకగా ఇచ్చారు. ఆ విధంగా వివిధ రూపాల్లో కానుకలు సమర్పించి భక్తులు వేంకటేశ్వర స్వామిపై తమకున్న భక్తిని, నమ్మకాన్ని చాటుకుంటారు.

మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం(ఫిబ్రవరి 23,2021) 54వేల 479 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 24వేల 446 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3 కోట్ల 44 లక్షలు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. మరోవైపు అలిపిరి దగ్గర సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు. ఇప్పటికే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేశారు.

కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న పుణ్యక్షేత్రం తిరుమల. ఏడు కొండల్లో శ్రీవేంకటేశ్వర స్వామి కొలువుదీరిన ఈ పుణ్యక్షేత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు. నిత్యం వేలాది మంది తిరుమలకు వస్తుంటారు. శ్రీవారిని కనులారా దర్శించుకుని భక్తులు పులకించిపోతారు.

ట్రెండింగ్ వార్తలు