Difference Between BJP Leaders In Palamuru : తెలంగాణ ..దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటి.. మంచి ఊపు మీదుంది కమలదళం. కానీ ఎదుగుతున్న వేళ.. జిల్లాల్లో వర్గ విబేధాలు పార్టీకి తలనొప్పిగా మారుతున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా బీజేపీలో హేమాహేమీ నేతలున్నారు. కానీ ఈ జిల్లాలో పాత, కొత్త నేతల మధ్య సయోధ్య లోపించిందని, కలహాలు ముదిరాయని పార్టీ వర్గాలే భావిస్తున్నాయట. ఆధిపత్య పోరు కాస్తా…తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటనలోనే బహిర్గతమయ్యాయి.
కలత చెందిన ఎర్ర శేఖర్ :
దీంతో పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి ఎర్రశేఖర్ రాజీనామా చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి ఎర్ర శేఖర్ రాజీనామా చేసిన వెంటనే అధిష్టానం రంగంలోకి దిగి పరిస్థితిని చక్కబెట్టింది. ఆ సాయంత్రానికే రాజీనామా ఉపసంహరణ ప్రకటన విడుదలైంది. చకచకా సంభవించిన ఈ పరిణామాలతో.. అసలు పాలమూరు బీజేపీలో ఏం జరుగుతుందనే చర్చ తెరపైకి వచ్చింది. పేరుకే పార్టీకి జిల్లా అధ్యక్ష పదవి తప్ప…తొలి నుంచి రాష్ట్ర నాయకత్వం, జిల్లాలోని సీనియర్ నాయకత్వం వివక్ష కనబర్చిందన్న ఆవేదనలో ఉన్నారట శేఖర్. తనకు కనీస గౌరవం ఇవ్వకుండా..కొందరు నేతలు పార్టీ కార్యక్రమాల్ని హైజాక్ చేస్తున్నారనేది ఆయన ఆరోపణ. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఒక నేత పార్టీ కార్యక్రమాల రూపకల్పన చేసి, చివర్లో సమాచారం ఇవ్వడంపై కలత చెందారట.
అంతర్గత కలహాలు :
ఇటీవల బండి సంజయ్ టూర్‌పై తనకు సమాచారం ఇవ్వకపోవడంతో అవమానం జరిగినట్లు భావించారట ఎర్ర శేఖర్. జడ్చర్ల, మహబూబ్ నగర్, దేవరకద్ర నియోజకవర్గాల్లో కార్యక్రమాలను మాటమాత్రం కూడా చెప్పకుండా చేసేశారట జిల్లా బీజేపీ నేతలు. మహబూబ్‌నగర్‌లో బండి సంజయ్ ప్రెస్ మీట్ పెట్టేందుకు యత్నించగా…పాత టీం…టూర్ షెడ్యూల్ మార్చి షాక్ ఇచ్చిందట. మూడు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో తనకు కనీస ప్రాధాన్యత ఇవ్వకపోతే జిల్లా అధ్యక్ష పదవితో గౌరవం పెరిగినట్లా…తగ్గినట్లా అనే అంతర్మథనంతోనే రాజీనామా ఎపిసోడ్‌కు తెరలేపారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. గతంలో నాగం జనార్థన్‌రెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పార్టీలో ఇమడలేకపోవడానికి జిల్లాకు చెందిన ఆ వర్గమే అడ్డుపడిందని, ఇప్పుడూ కూడా అదే జరుగుతోందని ఎర్ర శేఖర్ అనుచర వర్గం ఆరోపిస్తోంది. మొత్తానికి పాలమూరు పార్టీలో అంతర్గత కలహాలపై పార్టీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటోందనని పార్టీ క్యాడర్ ఆసక్తిగా ఎదురు చూస్తోంది..